2019వ సంవత్సరంలో చెన్నైకి చేరువలో ఉండే మహాబలిపురం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారత పర్యటనలో భాగంగా.. మనదేశ ప్రధాని నరేంద్ర మోడీతో ఈ ప్రదేశంలోనే భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  అయితే భారత, చైనా దేశాధినేతలు మహాబలిపురం ప్రాంతాన్నే ఎంచుకోవడానికి చారిత్రక కారణాలే ఉన్నాయి. చెన్నైకు సుమారు 50కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ నగరం. ఏడో శతాబ్ధంలో పల్లవ వంశస్థుల రాచరిక పాలనలో మొదటి నరసింహవర్మన్ ఈ నగరాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించాడు. పల్లవ రాజు ఓడరేవును కూడా నిర్మించడంతో.. ఇతర దేశాలతో వ్యాపార లావాదేవీలకు కేంద్ర బిందువుగా ఉండేది మహాబలిపురం. అంతేకాదు అద్భుత శిల్పకళకు, ఆలయాలకు ప్రసిద్ధి గాంచింది మహాబలిపురం. ఆనాడు పల్లవులు తమ రాయబారులను చైనాకు పంపుతుండటంతో.. భారత్-చైనా దేశాల మధ్య సంబంధం కొనసాగింది. అంతేకాదు ఆ సమయంలో చైనా ట్రావెలర్ హ్యూన్ త్సాంగ్ కూడా మహాబలిపురంలో పర్యటించారు. అంటే దాదాపు రెండు వేల సంవత్సరాల నుంచే భారత్-చైనాల మధ్య సాన్నిహిత్య సంబంధాలు కొనసాగుతున్నట్టు చరిత్ర చెబుతోంది. 


క్రీస్తుపూర్వం మొదటి, రెండో శతాబ్దంలో తమిళనాడు తీర ప్రాంతాల్లో సముద్ర జలాల ద్వారా చైనా-భారత దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు సాగేవట. అక్కడ లభించిన కుండలు, ఇతర మట్టి పాత్రలు, చైనా నాణేలు దొరకడమే అందుకు నిదర్శనం. అందుకే చైనా అధినేత జీజిన్ పింగ్ మహాబలిపురంలో మోడీతో సంప్రదింపులు జరిపారు. మహాబలిపురం చారిత్రక కట్టడాలకు అద్దం పడుతోంది. ఇక్కడ కొలువైన దేవాలయం పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది.  ఈ గుడిపై భారతీయ పురాణ గాథలు, పాత్రలు, దేవతలు, దేవుళ్ల విగ్రహాలతో పాటు నృత్యకారిణుల విగ్రహాలు కనువిందు చేస్తుంటాయి. బంగాళాఖాతం తీరం వెంబడి ఆహ్లాదకర వాతావరణంలో నిర్మితమైన ఈ దేవాలయం యునెస్కో గుర్తింపు కూడా పొందింది. తొలి నరసింహవర్మ కొండలను తొలిచి గుహాలయాలను నిర్మిస్తే, రెండవ నారసింహవర్మ గ్రానైట్ దిమ్మెలను రకరకాల ఆకారాల్లో మలచి ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మాణాలు చేయడం ఈ శిలాయాల ప్రత్యేకత. ఈ టెంపుల్ లో తూర్పు ముఖంలో కొలువైన ప్రధాన దేవాలయంలో ధారాలింగం, శివలింగం వెనకనే శివపార్వతుల మధ్యలో సుబ్రహ్మణ్యస్వామి ఉన్నట్లు గోడలపై చెక్కి ఉంటుంది. 


వెనుకవైపు గుడిలో విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద అడుగులు వేసేంతటి ఏనుగుల భారీ శిల్పాలు పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి. గుడి వెనుక ఒక పెద్ద రాతి సింహం, దానిపై ఓ సైనికుడు స్వారీ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఇది ఆనాటి సైనికుల ధైర్యసాహసాలను ప్రస్ఫుటిస్తుంది. ఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా ఆశ్చర్యపరుస్తోంది. మహాబలిపురం వెళ్లే పర్యాటకులకు మరో అద్భుతమైన, అపురూపమైన అనుభవం దొరుకుతుంది. సాయంకాల సమయంలో బీచ్ లో చల్లగాలిని ఆస్వాదించవచ్చు. ఇక్కడి తీరప్రాంతంలోని పడవలను అద్దెకు తీసుకుని బంగాళాఖాతంలోకి అలా హాయిగా షికారు చేసే వీలుంది. ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ రోజున ప్రారంభమయ్యే వార్షిక వేడుక "డాన్స్ ఫెస్టివల్"గా అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. ఇది కొత్త సంవత్సరంలోని మొదటి నెల పొడవునా అన్ని శనివారాల్లో జరుగుతుంది. ఇన్ని ప్రత్యేకతలు సంపాదించుకున్న మహా బలిపురం రెండు దేశాధినేతలు కలుసుకోవడానికి కేంద్రంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: