నిజం చెప్పులు తొడుక్కునే లోపు... అబద్ధం ప్రపంచాన్నే చుట్టేస్తుందన్నది ఓ నానుడి. ఇదిప్పుడు అక్షరాలా నిజమవుతోంది. కరోనా వైరస్ ప్రభావంతో చైనా అనే మాట వినిపిస్తే చాలు.. జనాలు జంకుతున్నారు. చైనా బజార్, చైనీస్ ఫుడ్, చైనా ఐటమ్స్.. ఇలా ఎక్కడ చైనా అనే పేరు వినిపించినా మాకొద్దు బాబోయ్ అంటున్నారు. చివరికి మందబాబులకు కూడా ఈ కరోనా ఫీవర్ పట్టుకుంది.
చైనాలో కరోనా వైరస్ దాటికి జనాలు పిట్టల్లా రాలిపోతుండటంతో.. ప్రపంచదేశాలు హడలెత్తుతున్నాయి. మిగతా దేశాలకు సైతం వ్యాపించిన ఈ వైరస్ మహమ్మారి.. క్షణక్షణం వణికిస్తోంది. నిన్న మొన్నటిదాకా లక్షణాలే తప్ప వైరస్ బాధితులు లేరనుకున్న ఇండియాలోకీ కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా, కేరళలో ఓ కరోనా కేసు నమోదైంది.
కరోనా కలకలంతో కేంద్రంతో పాటు రాష్ట్రప్రభుత్వాలు అలర్టయ్యాయి. అయితే, అంతకు ముందే జనాలు.. ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. ఎంతలా అంటే.. చైనా పేరెత్తితే చాలు ఆమడదూరం జరిగిపోతున్నారు. కరోనా వైరస్ పుట్టిల్లు చైనానే కాబట్టి.. ఆ పేరు వింటేనే జంకుతున్నారు. ఏళ్ల తరబడి ఇండియాలో ఉంటున్న చైనీయుల నుంచి దూరం జరుగుతున్నారు.
నిన్నమొన్నటి దాకా జనాలు ఆవురావురుమంటూ తిన్న చైనీస్ ఫాస్ట్‌ఫుడ్‌పైనా ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది. అటు వైపు చూసేందుకు కూడా చాలామంది భయపడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఏ వస్తువైనా తక్కువ ధరలో దొరుకుతుందని చైనా బజార్‌పై ఎగబడి కొనే జనం.. ఇప్పుడు కాస్త ఆలోచిస్తున్నారు. ఎందుకొచ్చిన ముప్పు అనుకుని.. దూరంగా ఉంటున్నారు . చైనా ఐటమ్స్‌ను వాడితే ఏం జరుగుతుందోనన్న భయంతో.. కొనకపోవడమే బెటర్ అనుకుంటున్నారు.
ఆఖరికి.. బ్రాండ్‌తో సంబంధం లేకుండా పెగ్గుల మీద పెగ్గులేసే మందుబాబులకు కూడా కరోనా ఫీవర్ పట్టుకుందంటే అతిశయోక్తి కాదు. కరోనా అనే బీర్‌ను తాగడమే మానేశారట. నిజానికి అది మెక్సికన్ బీర్ అయినప్పటికీ.. కరోనా అనే పేరుండటంతో దూరం పెట్టేస్తున్నారు. దీంతో మెక్సికన్ బ్రాండ్ కరోనా సేల్స్ దారుణంగా పడిపోయాయి. ఫారెన్ బ్రాండ్ బీర్ తాగాలనుకునే వాళ్లు వేరే బ్రాండ్ టేస్ట్ చేస్తున్నారు తప్ప కరోనా వైపు కన్నెత్తి చూడ్డం లేదట.
ముందు జాగ్రత్త అవసరమే కానీ.. మరీ ఇంత సిల్లీగానా అని కొందరంటుంటే.. ఆ మాత్రం జాగ్రత్త పడటంలో తప్పేముందని మరికొందరంటున్నారు. ఏదేమైనా మొత్తానికి కరోనా వైరస్.. జనాల్ని బాగానే భయపెట్టేసింది.