ఒక పడవ చుక్కాని సహాయంతో సరైన దారిలో ముందుకు వెళుతుంది. అదే విధంగా పిల్లలు సరైన మార్గంలో ముందుకు వెళ్లాలంటే క్రమశిక్షణ సహాయం చేస్తుంది. మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునేలా శిక్షణ ఇవ్వడమే క్రమశిక్షణ. పిల్లలు క్రమశిక్షణ అలవరచుకుంటే ఆ శిక్షణ వారు తప్పు చేయకుండా మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చి వారు చెడిపోవడానికి కారణమవుతున్నారు.
అలా కాకుండా పిల్లలకు నిబంధనలు పెట్టి వాటిని పాటించేలా చేస్తే వారు సన్మార్గంలో ఎదగడానికి క్రమశిక్షణ తోడ్పడుతుంది. తల్లిదండ్రులు పెట్టిన నిబంధనలను పిల్లలు పాటిస్తూ ఉంటే వాళ్లను మెచ్చుకొని ప్రోత్సహించాలి. అలా మెచ్చుకోవడం ద్వారా పిల్లలు ఏం చెప్పినా త్వరగా వింటారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో వారు తప్పు చేసినా కోపం తెచ్చుకోకూడదు.
క్రమశిక్షణ వల్ల కలిగే ఉపయోగాలను పిల్లలకు తెలియజేయాలి. పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులను సరిదిద్ది ప్రేమతో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. సమర్థవంతమైన క్రమశిక్షణతో పిల్లలు చిన్న వయస్సునుండే ఏ రంగంలోనైనా విజయం సాధించగలరు. ఈ మధ్య కాలంలో పిల్లలు నాగరికత పేరుతో సామాజిక మాధ్యమాలపై దృష్టి పెట్టి చదువు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పిల్లలకు చిన్న వయస్సు నుండే వారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా తీర్చిదిద్దితే వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు.