జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఏం కావాలి.. ఈ ప్రశ్నకు సమాధానం అడిగితే నూటికి 90 శాతం మంది డబ్బే అంటారు. ఈ సమాధానాన్ని తప్పుబట్టలేం. ఎందుకంటే.. తగినంత డబ్బు లేకపోతే ఒక్క పూట కూడా మన జీవితాలు సాఫీగా సాగవు. సమాజంలో కనీస గౌరవంతో బతకాలంటే డబ్బు అవసరాన్ని విస్మరించలేం.
అందుకే.. నవతరం మానవుడు డబ్బు వెనుక పరుగులు తీస్తున్నాడు. అయితే కేవలం డబ్బు ఒక్కటే అన్నింటినీ సమకూర్చి పెడుతుందా.. మనిషి జీవితాన్ని సుసంపన్నం చేస్తుందా.. అంటే కానే కాదని చెప్పాలి. ఓ వ్యక్తి లక్షలకు లక్షలు సంపాదించి తెచ్చి ఇంట్లో గృహిణి చేతుల్లో పోసినంత మాత్రాన ఆ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతుందా.. అంటే కాదనే చెప్పాలి.
ఎందుకంటే.. సంసారం అంటే భౌతిక బంధాలే కాదు.. మానసిక సమస్యలు కూడా.. అందుకే సంపాదన ఎంత ముఖ్యమో ఓ కుటుంబంలో బంధాలూ అంతే ముఖ్యం. కుటుంబ సభ్యుల మధ్య మానసిక బంధం ధృఢంగా ఉండాలంటే.. మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఉండాలి. తమ బాధ చెప్పుకునే వీలు అందరికీ ఉండాలి. అందుకు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఫ్యామిలీకి సమయం కేటాయించగలగాలి.
అలా చేసినప్పుడే.. ఆ కుటుంబంలో బంధాలు బలపడతాయి. అలా లేనప్పుడు డబ్బు సంపాదించిపెడుతున్నాం కదా.. సంతోషంగా ఉండలేరా అంటే.. సంతృప్తికరమైన సమాధానం రాదు. ఆ ఇంట్లో సంతోషం వెల్లి విరియదు. ఇంతకీ మీ కుటుంబం సంగతి ఏంటి.. ఒక్కసారి సమీక్షించుకోండి. తప్పులుంటే దిద్దుకోండి.