ఒక్క రాత్రిలో జీవితాలు తలకిందులు కావడం అంటే ఇదేనేమో..? అప్పటి వరకు మనకు అండగా ఉన్న ప్రకృతి పగబట్టినట్లే విరుచుకుపడటం ఏమిటో ? అమ్మానాన్నలతో పాటు కుటుంబంలోని తొమ్మిది మందిని బలిగొనడం ఏంటో? దాన్నుంచి కోలుకునేలా చేసి.. జీవితంలో నాలుగు అడుగులు వేసేలా భరోసా ఉన్న వ్యక్తి కూడా మరణించడం ఏంటో.. అచ్చం సినిమా కథను తలపించే ఇదంతా కేరళ వరద బాధితురాలి విషాధ గాథ.


కేరళలోని వాయనాడ్ లో జూన్ 30న ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఎడతెరిపి లేని వర్షాలతో కొండచరియలు విరిగి పడటం, వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం, వేల మంది క్షతగాత్రులు కావడం జరిగింది. వీరిలో చూరాల్ మల గ్రామానికి చెందిన శ్రుతి(24) కుటుంబమూ ఉంది. ఈమె అమ్మానాన్నలతో పాటు తొమ్మిది మందిని కోల్పోయింది. అయితే దీనికి ముందే జూన్ 2న శ్రుతికి జెన్సన్(27)తో పెళ్లి కుదిరింది.


వాస్తవానికి వీరి మతాలు వేరు. కానీ పెద్దల అంగీకారంతో వీరిద్దరు ఒకటి అవుదామని అనుకున్నారు. అయితే అదే పెద్దల్లోని శ్రుతి కుటుంబం మాత్రం ఆ తర్వాత వీరి వివాహాన్ని చూడలేకపోయింది. కారణం ప్రకృతి విలయతాండవం.


జూన్ 30న వచ్చిన వరదలతో కొండచరియలు విరిగిపడి శ్రుతి అమ్మానాన్న, సోదరితో పాటు తొమ్మిది మంది చనిపోయారు. ఇంతటి దుఃఖాన్ని ఆమె జెన్సన్ సాయంతో అధిగమించింది. శ్రుతికి అండగా నిలిచేందుకు అతడు ఉద్యోగాన్ని సైతం వదిలేశాడు. వరద బాధితత ప్రాంతాల పర్యటనకు మోదీ వచ్చినప్పుడు వీరు కలిసే మాట్టాడారు. ఇదంతా జాతీయ మీడియాలో వచ్చింది.


ఈ జంట గుండె ధైర్యాన్ని ప్రశంసిస్తూ.. కథనాలు వచ్చాయి. శ్రుతి కుటుంబ సభ్యులకు నివాళులర్పించేందుకు శ్మశాన వాటికకు వచ్చి.. సమాధులు వద్ద జీవితాంతం తోడుంటామని ప్రమాణం చేశారు. ఈ నెలలో నిరాడంబరంగా రిజిస్టర్డ్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.


శ్రుతి అంతా మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనే లోపు.. జెన్సన్ అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించాడు. శ్రుతి, జెన్సన్ కుటుంబ సభ్యులు వ్యానులో వెళ్తుండగా రహదారిపై వీరి వాహనం, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రుతి స్వల్ప గాయాలతో బయట పడింది. కాకపోతే సీఎం పినరన్ విజయ్ తో పాటు కేరళ ప్రజలంతా ఆమెకు సపోర్టుగా నిలిచారు. మేమంతా మీ కుటుంబమే అంటూ పోస్టులు పెడుతూ భరోసా కల్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: