పసిడి ధరలు పడిపోతున్నాయి. స్టాక్‌మార్కెట్‌ బేర్‌మంటుంటే.. బంగారం ధర తగ్గిపోతోంది.  24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 76,850 రూపాయలకు దిగొచ్చింది.  22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.70,450కి తగ్గింది.  నాలుగు రోజుల్లోనే 10గ్రాములపై దాదాపు 3 వేల రూపాయలు తగ్గిందంటే కలయా నిజమా అని గిల్లుచూసుకుంటున్నారు పసిడిప్రియులు.  ఓ దశలో 82వేల రూపాయలకు ఎగువన ఆల్‌టైం రికార్డ్‌ని నమోదుచేసిన పసిడి.. పెరుగుట విరుగుట కొరకేనన్నట్లు కొండ దిగొస్తోంది.


దేశీయ బులియన్ మార్కెట్‌లో వరుసగా ఐదోరోజు బంగారం ధరలు తగ్గాయి. ఇంత సడెన్‌గా పసిడి ఎందుకంతలా తగ్గుతోందంటే.. అంతా ట్రంప్‌కి థాంక్స్‌ చెప్పాలి. అవును ఆయనగారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాకే ప్రపంచమంతా పసిడి టెక్కు తగ్గింది.  అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి ఇంకా సమయమున్నా.. ట్రంప్‌ గెలుపుతో ప్రపంచ మార్కెట్‌ ప్రభావితమవుతోంది. అప్పటిదాకా ముట్టుకోలేరన్నట్లు మురిపించిన బంగారం ధర.. నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఇన్వెస్టర్లు బంగారంనుంచి తమ పెట్టుబడులను స్టాక్‌మార్కెట్‌తో పాటు ఇతర పెట్టుబడులకు మళ్లిస్తుండటం కూడా గోల్డ్‌ రేట్స్‌ డౌన్‌ఫాల్‌కి మరో ముఖ్యకారణం.


మొన్నటిదాకా పసిడి దూకుడు చూస్తుంటే ఈ సంవత్సరాంతానికి పది గ్రాముల బంగారం ధర లకారం దాటుతుందనుకున్నారు. మనవల్ల కాదని మధ్యతరగతి డీలాపడేలా మిడిసిపడింది పసిడి. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రభావం బులియన్‌ మార్కెట్‌ని హిట్‌ చేసింది. చివరికి అంచనాలు ఎలా ఉన్నాయంటే పది గ్రాముల బంగారం ధర 60 వేలదాకా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు.  గ్లోబల్ మార్కెట్‌ నుంచి నెగిటివ్ సంకేతాలు, అంతర్జాతీయంగా నిల్వలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు పసిడి ధరల్ని ప్రభావితం చేస్తున్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర లక్షా వెయ్యికి వచ్చింది. ట్రంప్‌ గెలవగానే డాలర్‌ ఒక్కసారిగా రికార్డు స్థాయికి ఎగబాకింది. దీంతో అంతర్జాతీయంగా గోల్డ్‌రేట్‌ ఒకే రోజు ఔన్సుకు 65డాలర్లకు పైగా పతనమైంది. డాలర్‌, గోల్డ్‌.. అవిభక్త కవలల్లాంటివి. డాలర్ విలువ పెరిగితే.. ఈక్విటీ మార్కెట్లు, బాండ్ ఈల్డ్స్‌పై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతారు. ఇదే సమయంలో బంగారంపై ఆసక్తి తగ్గుతుంది. పెట్టుబడులు తగ్గటంతో సహజంగానే బంగారం ధరలు తగ్గుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: