నేటి యువత పెళ్లి అనే మాట వినగానే భయంతో పారిపోతున్నారు. తల్లిదండ్రులు పెళ్లి గురించి ప్రస్తావించినప్పుడల్లా "నాకు పెళ్లి అవసరం లేదు" అంటూ తప్పించుకుంటున్నారు. సరైన కారణంతో వివాహం వద్దనుకోవడం ఒక విధమైతే, అటు ఇటు ఉన్న ఆలోచనలు, అధిక అంచనాలు గేమోఫోబియాకు దారితీస్తాయి. ఈ గేమోఫోబియాపై సౌరాష్ట్ర యూనివర్శిటీ మనోవిజన్ భవన్‌కి చెందిన పూజా దుమాడియా, నాన్సీ రాథోడ్ అనే ఇద్దరు విద్యార్థులు సర్వే నిర్వహించారు. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పూజా, నాన్సీ 1242 మంది యువతపై చేసిన సర్వేలో 90.10% మంది పెళ్లి చేసుకోకూడదని, ఆలస్యంగా చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. 67.80% మంది పెళ్లి బాధ్యతలు తలకెత్తకూడదని, 63.60% మంది యువత పెళ్లి వారి లక్ష్యాలకు ఆటంకం అని భావిస్తున్నారు. 70.20% మంది పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛకు సంకెళ్లు వేసినట్లు అభిప్రాయపడ్డారు.
68.20% మంది యువత తమ కెరీర్‌తో బిజీగా ఉన్నందున పెళ్లి వంటి సామాజిక ఆచారాలకు దూరంగా ఉన్నారని చెప్పారు. ఇతరుల అనుభవాల వల్ల వివాహం వద్దనుకుంటున్నట్లు 74.40% మంది చెప్పారు. 75.60% మంది తామకు నచ్చిన వ్యక్తి దొరకడం లేదని.. 74.40% మంది ఆర్థిక కారణాలతో వివాహం చేసుకోవడం లేదని చెప్పారు.
తల్లిదండ్రులు డైవర్స్ తీసుకోవడం కూడా నేటి యువతపై ప్రభావం చూపుతున్నాయి. ఈ జాబితాలో 75.60% మంది నమ్ముతున్నారు. 70.70% మంది ఇతరులపై విశ్వాసం కుదరక పెళ్లి వద్దనుకుంటున్నారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో పెళ్లిని దాటవేస్తున్నారని 65.40% మంది తెలిపారు.
కొందరు యువతరం తన కెరీర్‌లో ముందుకు సాగాలని, పేరు సంపాదించాలని, వ్యక్తిగత లక్ష్యాలు సాధించాలనుకుంటున్నారు. ఇలాంటి వారు పెళ్లి జోలికి వెళ్లడంలేదని సర్వేలో బయటపడింది. చిన్న కుటుంబాల అభివృద్ధి, డబ్బుతో అన్నీ పొందవచ్చనే ఆలోచన కూడా పెళ్లి నుండి దూరంగా ఉంచుతున్నాయి.
లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కాన్సెప్ట్ కూడా యువతలో విస్తరిస్తోంది. పిల్లలపై భయం, బంధువుల చేదు అనుభవాలు, గత అనుభవాల వల్ల పెళ్లి వద్దనుకుంటున్నారు. ఫోన్, బాధ్యతల భయం, పాశ్చాత్య దేశాలకు వెళ్లడం, బాలీవుడ్ ప్రభావం, అధిక అంచనాలు, కెరీర్, మనసుకు నచ్చిన ప్రేమ దొరక్కపోవడం, విడాకుల అనంతరం పెళ్లి భయం వంటివి పెళ్లికి దూరంగా ఉండడానికి ప్రధాన కారణాలు అని సర్వేలో తేలింది.