మరణం తర్వాత మానవ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అమెరికాకు చెందిన అనుభవజ్ఞురైన నర్స్ జూలీ మెక్‌ఫాడెన్ మరణాంతరం మనిషి శరీరంలో ఏం జరుగుతుందనే దాని గురించే ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చాలా సంవత్సరాలు ఇంటెన్సివ్ కేర్‌లో పనిచేసిన ఆమె, వేల సంఖ్యలో మనుషుల మరణాలను చూశారు. మరణం సమయంలో శరీరంలో సాధారణంగా కనిపించే మార్పులను గమనించారు. ఈ మార్పుల గురించి ఆమె వివరించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయింది.

జూలి చెప్పిన ప్రకారం, మరణం తర్వాత శరీరం పూర్తిగా విశ్రాంతి స్థితికి చేరుకుంటుంది. దీంతో మూత్రం పోవడం, ముక్కు లేదా చెవుల నుంచి రక్తం కారడం వంటి సంఘటనలు జరగవచ్చు. మరణం తర్వాత శరీరంలోని అన్ని కండరాలు నియంత్రణ కోల్పోయి పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది.

మరణం తర్వాత శరీరం చల్లబడటం ప్రారంభమవుతుంది. ప్రతి గంటకు సుమారు 1.5 డిగ్రీల ఫారెన్‌హీట్ చొప్పున శరీరం చల్లబడుతుంది. కొంతమందిలో ఈ చల్లబడే ప్రక్రియ వెంటనే మొదలవుతుంది. మరికొందరిలో ఇది ప్రారంభమవడానికి రెండు గంటల సమయం పట్టవచ్చు. చుట్టుపక్కల వాతావరణం, మరణించే సమయంలో వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వంటి అనేక కారకాలు ఈ చల్లబడే ప్రక్రియను ప్రభావితం చేస్తాయి.

మరణం తర్వాత శరీరంలోని రక్తం గురుత్వాకర్షణ వల్ల కింది భాగాలకు చేరుతుంది. దీంతో శరీరం పై భాగం లేతగా, కింది భాగం ముదురు రంగులో కనిపిస్తుంది. మరణం తర్వాత శరీరంలోని కండరాలు క్రమంగా గట్టిపడతాయని జూలి వివరించారు. శరీరంలోని జీవక్రియ ప్రక్రియ మందగించి ఆగిపోవడంతో ఈ గట్టిదనం ఏర్పడుతుంది. రిగర్ మోర్టిస్ అని పిలువబడే ఈ ప్రక్రియ సాధారణంగా మరణించిన 2-4 గంటల తర్వాత ప్రారంభమై 72 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో శరీరం బరువుగా, గట్టిగా మారుతుంది. చివరకు, శరీరం కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. జూలి వివరించిన ఈ మార్పులు మరణం గురించిన భయాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఎందుకంటే మరణం తర్వాత శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియల గురించి తెలుసుకోవడం వల్ల మరణం గురించిన భయం తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: