ఈ మధ్యకాలంలో గాడిద పాల గురించి విస్తృతమైన చర్చ నడుస్తోంది. గాడిద పాల వల్ల ప్రయోజనాలు ఇవనీ.. గేదె, ఆవు పాల కంటే దాని ధర ఎక్కువని.. ఇక ఈ వ్యాపారం చేస్తే లాభాల పంటలు పండుతాయని రకరకాల ప్రచారాలు హోరెత్తిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. గాడిద పాల వ్యాపారం పేరు చెప్పి రైతులను పెద్ద ఎత్తున ముంచేసింది తమిళనాడుకు చెందిన ఓ ముఠా!
తెలుగు రాష్ట్రాల్లో ఈ కుంభకోణం సుమారు రూ.100 కోట్ల మేర దగా అని అంటున్నారు. కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో.. కొంతమంది ఔత్సాహికులైన రైతులు చెన్నైలోని డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూపు సభ్యులను సంప్రదించారంట. దీంతో... ఈ వ్యాపారంలో అద్భుతమైన లాభాలు అంటూ వీరికి భరోసా కల్పించారంట ఆ గ్రూపు సభ్యులు. డాంకీ ప్యాలెస్ మిస్టర్ బాబు ఉలగనాథన్ ఆధ్వర్యంలో.. బాలాజీ, గిరి సుందరం, డాక్టర్ రమేష్, సోనికరెడ్డి బృందం.. ఒక్కో రైతు నుంచి సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.5 లక్షలు తీసుకున్నారని అంటున్నారు.
ఈ సమయంలో ఒక్కో పాడి గాడిదను రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల చొప్పున రైతులకు విక్రయించారంట. ఈ సమయంలో ఆ గాడిదల నుంచి ఉత్పత్తి అయిన పాలను లీటరుకు రూ.1,600 చొప్పున తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారంట. ఈ క్రమంలో రైతులకు నమ్మకం కలిగేలా మూడు నెలల పాటు డబ్బులు కరెక్ట్ గా చెల్లించారని అంటున్నారు. అయితే... గత 18 నెలలుగా సరఫరా చేసిన పాలకు డబ్బులు, సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు ఇవ్వడం లేదని చెబుతున్నారు.
దీనిపై సదరు సంస్థ సభ్యులను నిలదీస్తే... ఒక్కొక్కరికీ రూ.15 నుంచి 70 లక్షల వరకూ బ్యాంక్ చెక్కులు ఇచ్చారని.. అయితే అవి వెంటనే బౌన్స్ అయ్యాయని చెబుతున్నారు. ఈ జాబితాలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది రైతులు తమలాగా రూ.100 కోట్ల వరకు నష్టపోయారని అంటున్నారు.