ప్రపంచవ్యాప్తంగా సరికొత్త నినాదం వినిపిస్తోంది. జపాన్, చైనా లాంటి దేశాలు అయితే దీనినే ఎక్కువగా ప్రచారంలో పెడుతున్నాయి. రష్యా జనాభా తగ్గుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అంటూ కొత్త మంత్రిత్వ శాఖను రష్యా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తుంది. ఎక్కువ మంది పిల్లలను కనేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించేలా రష్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో చాలా దూరదృష్టితోనే ఆలోచించారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని కూడా ప్రోత్సహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లలు ఉంటేనే అన్న షరతుని ఎత్తేసి ఎంత మంది ఉన్నా ఓకే అంటూ ఇటీవల చట్ట సవరణ తెచ్చారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఈ నినాదం అందుకుంది. దేశంలో జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గుముఖం పడుతోంది అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అంటున్నారు. జనాభా పెరుగుదల రేటు 2.1 కంటే తక్కువ ఉండకూడదని డెమోగ్రఫీ నిబంధనలు చెబుతున్నాయని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. జనాభా రేటు తగ్గిపోతోంది. ఇది అత్యంత ప్రమాదం అని ఆయన అంటున్నారు. సమాజ మనుగడకు, దేశ శ్రేయస్సుకు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉండాల్సిందే అని ఆరెస్సెస్ చీఫ్ ఖండితంగా చెబుతున్నారు.
జనాభా రేటు తగ్గితే మానవ వనరులు పెద్ద ఎత్తున తగ్గిపోతాయని అని జనాభా పరిశోధన నిపుణులు చెబుతున్నారు. భారత్ లాంటి దేశాలలో మహిళల సంతానోత్పత్తి రేటు గత అర్ధ శతాబ్ద కాలంగా గణనీయంగా తగ్గి పోతూ వస్తోందని పరిశోధనలో తేల్చాయి. 1950లో ఒక మహిళ సంతానోత్పత్తి రేటు జీవిత కాలంలో 4.7 గా ఉంటే.. 2017 నాటికి 2.4 శాతానికి పడిపోయింది అని అంటున్నారు.
ఓ అధ్యయనం ప్రకారం 2100 నాటికి జనాభా వృద్ధి రేటు 1.7 శాతానికి పడిపోవచ్చు అని చెబుతున్నారు ఇప్పుడు అధిక జనాభా అని అంతా అంటున్న పరిస్థితి నుంచి జనాలు ఎక్కడ ఉన్నారో వెతుక్కునే దారుణమైన పరిస్థితులు కూడా వస్తాయంట.
వీటిని అన్నింటినీ చెబుతూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ భారతదేశం లాంటి దేశాలో ప్రతీ ఒక్కరూ ఎక్కువ మంది పిల్లలను కనాలని బలమైన నినాదం ఇచ్చారు. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఈ విషయంలో సీరియస్ గా దృష్టి పెట్టి ఏదైనా చట్టం తెస్తుందా అన్నది చూడాల్సి ఉంది.