సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంబరాల సందడి నెలకొన్నది. రంగుల రంగవల్లులు, భోగి మంటలు, కొత్త అల్లుళ్ల రాకతో ఊరూవాడా కళకళలాడుతున్నాయి. ఈ పండుగలో ప్రత్యేక ఆకర్షణ గంగిరెద్దుల ఆట అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఇంటింటికీ తిరుగుతూ గంటలు వాయిస్తూ, తల ఊపుతూ ఆశీర్వదించే గంగిరెద్దులను చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. కానీ, తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం అసలు ఎలా మొదలైందో మీకు తెలుసా? గంగిరెద్దుల ఆట వెనుక ఉన్న చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మరి అదేంటో తెలుసుకుందాం..

సంక్రాంతి సమయంలో గంగిరెద్దుల ఆట పుట్టుకకు సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఓ ముఖ్యమైన పురాణగాథ ప్రకారం, శివుడు తన వాహనమైన నందిని భూమిపైకి పంపి, ప్రజలను ఆశీర్వదించమని ఆజ్ఞాపించాడు. అందుకే సంక్రాంతి సమయంలో గంగిరెద్దులను సందర్శించడం శుభసూచకంగా ప్రజలు నమ్ముతారు. గంగిరెద్దుల ముందు తలవంచడం ద్వారా శివుడి ఆశీస్సులు లభిస్తాయని జనాలు విశ్వసిస్తారు.

మరో కథనం ప్రకారం, పూర్వం రాజులు తమ రాజ్యంలోని ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి మారువేషాల్లో తిరిగేవారు. అదేవిధంగా, గంగిరెద్దుల వాళ్లు తమ గంగిరెద్దులతో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆర్థిక పరిస్థితులను, కష్టసుఖాలను తెలుసుకునేవారు. తద్వారా సమాజంలో పరిస్థితులను తెలుసుకొని మంచిగా పరిపాలించేవారు. ఇది కాలక్రమంలో ఒక సంప్రదాయంగా మారిందని చెబుతారు.

చారిత్రక కోణంలో చూస్తే, వ్యవసాయాధారిత సమాజంలో పశువులకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. ముఖ్యంగా ఎద్దులు రైతుల జీవితంలో ఒక భాగం. పంట పొలాలను దున్నడానికి, బరువులు మోయడానికి ఎద్దులు ఎంతో ఉపయోగపడేవి. సంక్రాంతి పంటల పండుగ కావడంతో, రైతులు తమ పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాటిని అలంకరించేవారు. ఈ ఆచారం నుంచే గంగిరెద్దులను ప్రత్యేకంగా అలంకరించి ఊరూరా తిప్పే సంప్రదాయం మొదలై ఉండవచ్చని భావిస్తారు.

గంగిరెద్దుల ఆట కేవలం వినోదం మాత్రమే కాదు, ఇది ఒక కళారూపం కూడా. గంగిరెద్దుల వాళ్లు రంగురంగుల దుస్తులు ధరించి, తమ ఎద్దులను అందంగా అలంకరిస్తారు. వాటికి గజ్జెలు, గంటలు కట్టి, లయబద్ధంగా డోలు వాయిస్తూ నృత్యం చేయిస్తారు. ఈ సమయంలో వారు చెప్పే పాటలు, చేసే విన్యాసాలు ప్రేక్షకులను అలరిస్తాయి. గంగిరెద్దులను ఆడించడం ఒక ప్రత్యేక నైపుణ్యం. చిన్నప్పటి నుంచి ఎద్దులకు ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే వాటితో అనుబంధం పెంచుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది.

కాలక్రమంలో అనేక మార్పులు చోటుచేసుకున్నా, గంగిరెద్దుల ఆట ఇప్పటికీ సంక్రాంతి పండుగలో ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతోంది. అయితే, ఆధునిక జీవనశైలి, వ్యవసాయంలో యాంత్రీకరణ వంటి కారణాల వల్ల గంగిరెద్దులను పోషించే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఈ కళను, సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: