డాక్టర్ల ప్రకారం ఓ ఫిక్స్‌డ్ టైమ్ అంటూ లేని నిద్ర వేళలు పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తాయి, తద్వారా జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇలాంటి అలవాట్లు ఉన్నవారు చిప్స్, స్వీట్లు వంటి చక్కెర పదార్థాలను ఎక్కువగా తినడానికి మొగ్గు చూపుతారని పరిశోధకులు కనుగొన్నారు. దీనికి కారణం లేకపోలేదు. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పడిపోతాయి. దీంతో వెంటనే శక్తినిచ్చే ఆహార పదార్థాల కోసం శరీరం ఆరాటపడుతుంది. ఫలితంగా పోషకాలు లేని జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వైపు ఆకర్షితులవుతారు. నిద్ర సరిగ్గా లేనివారు తమ ఆహారంపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది దీర్ఘకాలంలో ఊబకాయానికి దారితీస్తుంది.
ఇర్రెగ్యులర్ స్లీప్ టైమింగ్స్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కలిసి శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. డైజెస్టివ్ సిస్టమ్‌లో మంట, గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, చివరకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. కడుపులో మంట రావడానికి కారణం పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతినడమే. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడానికి, పోషకాలు సరిగ్గా అందకపోవడానికి కారణమవుతుంది.
కాబట్టి, ఆరోగ్యకరమైన జీవితం కోసం సరైన నిద్ర చాలా అవసరం. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం వల్ల మీ శరీరం ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తుంది. జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారం తినాలనే కోరికలను తగ్గిస్తుంది. కాబట్టి రోజు ఒకే సమయానికి పడుకోవడమే మంచిది.