ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళా జరగనుండగా.. అప్పుడే రికార్డు స్థాయిలో భక్తులు వచ్చేశారు. మొత్తం 45 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది కానీ.. ప్రస్తుత రద్దీ చూస్తుంటే ఆ లెక్కలు కూడా తక్కువే అనిపిస్తున్నాయి. 144 ఏళ్ల తర్వాత ఇంత భారీ కుంభమేళా జరుగుతుండటంతో భక్తులు పోలోమని వచ్చేస్తున్నారు.
కుంభమేళా ఎఫెక్ట్‌తో ప్రయాగ్‌రాజ్ మాత్రమే కాదు.. చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. శృంగ్వేర్‌పూర్, చిత్రకూట్, వారణాసి, మా వింధ్యవాసిని ధామ్, నైమిశారణ్య, అయోధ్య లాంటి ప్రదేశాల్లో కూడా భక్తుల సందడి మామూలుగా లేదు.
ఇంతమంది జనం వస్తుంటే శాంతి భద్రతలు చూడటం పోలీసులకు తలకుమించిన పనే అయిపోయింది. అందుకే ఎలాంటి అనుమతి లేకుండా కార్యక్రమాలు, ఊరేగింపులు, దీక్షలు, ధర్నాలు, ప్రదర్శనలు చేయకూడదని పోలీసులు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు.
ఇక కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే.. దేశంలోని 13 అఖాడాల నుంచి వచ్చిన సాధువులు, యోగులు, బాబాలు, అఘోరీలు. వాళ్లను చూడ్డానికి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక అఘోరీ ఒళ్లంతా విషపు పాములతో, పుర్రెలు పట్టుకుని కుంభమేళాలో హల్ చల్ చేస్తున్నాడట. ఆ వీడియో చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు. అది నిజంగా కుంభమేళాలో తీసిందేనా కాదా అని తెగ చర్చించుకుంటున్నారు.
ఆ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. "ఆ అఘోరీ ఎక్కడి నుంచి వచ్చాడు?", "ఆ పాములకు విషం తీసేశారా?", "విషం తీయకపోతే పాము కాటేస్తే ఆయనకు ఏమీ కాదా?", "అసలు ఇది కుంభమేళాలో జరిగిందా?" అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. వీడియోలో ఆ పాములు బుసలు కొడుతుండటం కూడా కనిపిస్తోంది. ఆ అఘోరీ నిజంగానే అక్కడికి వచ్చాడా లేదా అనేది పక్కన పెడితే.. ఇలాంటి వింతైన అఘోరీలు, సాధువులు కుంభమేళాలో మాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.