చెన్ వెయ్-నోంగ్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక పిల్లలు వద్దనుకున్న ఆయన, తన భార్య కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది మామూలు విషయం కాదు. ఏకంగా 11 దశల్లో జరిగే ఈ సంక్లిష్టమైన ఆపరేషన్‌ను తనపై తానే చేసుకోవాలంటే ఎంతో నైపుణ్యం, ఏకాగ్రత అవసరం. తైపే నగరంలో సొంత క్లినిక్ నడుపుతున్న చెన్, ఈ సాహసాన్ని చేసి అందరినీ నివ్వెరపోయేలా చేసాడు.
వాసెక్టమి ఎలా చేస్తారో అందరికీ చూపించాలనే ఉద్దేశంతో చెన్ ఈ ఆపరేషన్‌ను వీడియో తీశాడు. ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. సాధారణంగా 15 నిమిషాల్లో పూర్తయ్యే ఈ ప్రక్రియను చెన్ తనపై తాను చేసుకోవడంతో గంట సమయం పట్టింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఆపరేషన్ విజయవంతమైంది. ఆ తర్వాత చెన్ ఆరోగ్యంగా ఉన్నాడని సమాచారం.
ఈ అనుభవం వింతగా అనిపించినా, చేయగలిగేదే అని చెన్ తెలిపాడు. పురుషులకు వాసెక్టమి చేయించుకోవడం మహిళలు స్టెరిలైజేషన్ చేయించుకోవడం కంటే సులభమైన, తక్కువ ప్రమాదకరమైన ప్రక్రియ అని ఆయన వివరించాడు. ఈ విధానంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే వీడియోను షేర్ చేసినట్లు చెప్పాడు.
చెన్ చేసిన పనికి చాలామంది ధైర్యాన్ని మెచ్చుకున్నారు. భార్య పట్ల ఆయనకున్న నిబద్ధతను కొనియాడారు. అయితే, కొందరు మాత్రం దీనిలోని ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేసారు. కొందరు ఆయన్ని ధైర్యవంతుడని కొనియాడితే, మరికొందరు సొంతంగా ఇలాంటి ఆపరేషన్ చేసుకోవడం సురక్షితమేనా అని ప్రశ్నించారు. అయితే, చెన్ లైసెన్స్ కలిగిన సర్జన్ కావడంతో ఆయనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు లేవు. ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.