టెలికాం రంగంలో మరో కీలక ముందడుగు పడింది. నెట్‌వర్క్ సమస్యల వల్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న అసౌకర్యాలను తగ్గించేందుకు టెలికాం కంపెనీలు ఇప్పుడు ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను ప్రారంభించాయి. ఈ కొత్త సదుపాయం ద్వారా వినియోగదారులు తమ ప్రస్తుత నెట్‌వర్క్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోయినా, అదే సర్కిల్‌లోని ఇతర టెలికాం నెట్‌వర్క్ సేవలను ఉపయోగించుకోవచ్చు.
ఇంట్రా సర్కిల్ రోమింగ్ అనేది టెలికాం ఆపరేటర్ల మధ్య ఒక ఒప్పందం. దీని ద్వారా ఒక ఆపరేటర్ వినియోగదారులు తమ సిగ్నల్ అందుబాటులో లేకపోయినప్పుడు, అదే సర్కిల్‌లో పనిచేస్తున్న మరో ఆపరేటర్ టవర్ సిగ్నల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా వినియోగదారులకు ఎప్పటికీ సిగ్నల్ సమస్యలు ఉండవు. ఇక మీదట బీఎస్‌ఎన్‌ఎల్, జియో, ఎయిర్‌టెల్ సిమ్ కార్డులు కస్టమర్లు డిజిటల్ భారత్ నిధి కింద ఏర్పాటైన టవర్ల ద్వారా 4జీ సేవలను పొందొచ్చు.
దేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు టెలికాం సేవలను అందించే లక్ష్యంతో కేంద్రం డిజిటల్ భారత్ నిధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతంలో దీనిని యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అని పిలిచేవారు. దీనిని డిజిటల్ భారత్ నిధిగా మార్చారు. డిజిటల్ భారత్ నిధి నిధులతో ఏర్పాటు చేయబడిన టవర్లు సంబంధిత టెలికాం సర్వీస్ ప్రొవైడర్ వినియోగదారులకు మాత్రమే సేవలు అందిస్తాయి. ఈ సందర్భంలో టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ఇంట్రా-సర్కిల్ రోమింగ్ సేవలను ప్రారంభించారు.
డిజిటల్ భారత్ నిధి నిధులతో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పంచుకోవడానికి BSNL, airtel, reliance Jio సంస్థలు ముందుకు వచ్చాయని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. దీనివల్ల వివిధ నెట్‌వర్క్‌లకు ప్రత్యేక టవర్ల అవసరం తొలగిపోతుంది. DBN నిధులతో దేశవ్యాప్తంగా దాదాపు 27 వేల టవర్లు ఏర్పాటు చేయబడ్డాయని, 35,400 మారుమూల గ్రామాలు దీని ద్వారా ప్రయోజనం పొందుతాయని ఆయన అన్నారు.
ఒక వినియోగదారు తమ ప్రస్తుత నెట్‌వర్క్ కవరేజీ బలహీనంగా ఉన్నప్పుడు, అదే ప్రాంతంలో అందుబాటులో ఉన్న ఇతర ఆపరేటర్ నెట్‌వర్క్‌ను స్వయంచాలకంగా ఉపయోగించుకుంటారు. ప్రస్తుతానికి, భారతీయ టెలికాం దిగ్గజాలు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు ఈ సేవలను ప్రారంభించాయి. ఐసీఆర్ సేవలను ప్రారంభించడంతో వినియోగదారుల అనుభవం మరింత మెరుగవుతుందని భావిస్తున్నారు. ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలతో, టెలికాం వినియోగదారులకు నెట్‌వర్క్ సంబంధిత సమస్యలు గత చరిత్రగా మారనున్నాయి. “నో సిగ్నల్” అన్న మాటలు ఇకపై వినిపించవు!