సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చాలామంది అమ్మాయిలు అందంగా కనిపిస్తున్నారు వారిని చూసి తమ అందంగా లేము ఎందుకు అని మామూలు వ్యక్తులు కుంగిపోతున్నారు. వారిలాగా కనిపించేందుకు ఫిల్టర్లు, ఫోటోషాప్ ఇతర ఎడిటింగ్ టూల్స్ ఉపయోగిస్తారు. తమను తాము అందంగా చూపించుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. సాధారణ అమ్మాయిలు అలా కనిపించకలేకపోతే వారిలో ఆత్మన్యూనతను పెంచుతుంది.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అందమైన అమ్మాయిల ఫోటోలు, వీడియోలు నిత్యం దర్శనమిస్తాయి. వారిని చూసి తమ రూపాన్ని వారితో పోల్చుకుంటూ, చాలా మంది అమ్మాయిలు తమ అందంపై అసంతృప్తి చెందుతున్నారు. ఈ పోలికలు వారిలో నిరాశ, ఆందోళన, మానసిక ఒత్తిడికి దారితీస్తున్నాయి.
అంతేకాకుండా, సోషల్ మీడియాలో బాడీ షేమింగ్, సైబర్ బుల్లియింగ్ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు నువ్వు అందంగా ఉన్నావ్ ఇప్పుడేంటి ఇలా లావు అయిపోయావు? బొద్దుగా తయారయ్యావు? మొహంలో కల పోయింది వంటి కామెంట్స్ వారిని బాగా కృంగదీస్తున్నాయి. ఇవి తమ మానసిక ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతున్నాయని అమ్మాయిలు తెలుసుకోలేకపోతున్నారు. అందంపై అతిగా దృష్టి పెట్టడం వల్ల చదువు, కెరీర్, ఇతర ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.
అయితే, సోషల్ మీడియాను తెలివిగా ఉపయోగించడం చాలా ముఖ్యం. అందం అనేది కేవలం బాహ్య రూపం మాత్రమే కాదు, అంతర్గత సౌందర్యం కూడా ముఖ్యమని గుర్తించాలి. సోషల్ మీడియాలో చూసే విషయాలన్నీ నిజం కాదని, అవి కేవలం ఇతరులను ఆకర్షించడానికి రూపొందించారని అర్థం చేసుకోవాలి.
అమ్మాయిలు తమను తాము ప్రేమించుకోవడం, తమలోని ప్రత్యేకతలను గుర్తించడం చాలా అవసరం. సోషల్ మీడియాలో కనిపించే అవాస్తవిక అందాల ప్రపంచానికి దూరంగా ఉండాలి. నిజమైన స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ఈ "అందం జబ్బు" నుంచి బయటపడవచ్చు.