మనలో చాలామంది టూత్ బ్రష్‌లు వాడిన తర్వాత ఒకే కప్పులో లేదా హోల్డర్‌లో పెడుతుంటాం. బ్రష్ లో ఒకే దగ్గర కలిసి కనిపించడం మీరు చాలాసార్లు చూసే ఉంటారు. కుటుంబ సభ్యులందరూ ఒకే చోట బ్రష్‌లు పెట్టడం సర్వసాధారణం. అయితే, ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ప్రమాదకరమని మీకు తెలుసా? వింటుంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం, టూత్ బ్రష్‌లు ఒకే చోట పెట్టడం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.

దంత వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, టూత్ బ్రష్‌లను ఒకే చోట పెట్టడం వల్ల క్రాస్ కంటామినేషన్ జరుగుతుంది. అంటే ఒకరి బ్రష్‌లోని క్రిములు మరొకరి బ్రష్‌కు సులభంగా వ్యాపిస్తాయి. ముఖ్యంగా మనం బ్రష్ చేసిన తర్వాత టూత్ బ్రష్‌లో అనేక రకాల బ్యాక్టీరియా ఉంటాయి. నోటిలోని బ్యాక్టీరియాతో పాటు, గాలిలో ఉండే క్రిములు కూడా బ్రష్‌పై చేరతాయి.

ఒకే హోల్డర్‌లో బ్రష్‌లు పెట్టినప్పుడు, వాటి మధ్య తగినంత గాలి ప్రసరణ ఉండదు. తేమ అలాగే ఉండిపోవడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది కేవలం ఒకరి నోటిలోని బ్యాక్టీరియా మాత్రమే కాదు, మల విసర్జన సంబంధిత బ్యాక్టీరియా కూడా టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు గాలిలో కలిసి బ్రష్‌ల మీద చేరే అవకాశం ఉంది.

ఈ బ్యాక్టీరియా వ్యాప్తి వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులు సులభంగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశముంది. జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందడానికి ఇది ఒక కారణం కావచ్చు.

సరైన మార్గం ఏమిటంటే, ప్రతి బ్రష్‌ను విడివిడిగా నిల్వ చేయడం. ప్రతి ఒక్కరికీ వేర్వేరు కప్పులు లేదా హోల్డర్లు ఉపయోగించాలి. బ్రష్‌ల మధ్య కాస్త దూరం ఉండేలా చూసుకోవాలి. బ్రష్ చేసిన తర్వాత, బ్రష్‌ను శుభ్రంగా కడిగి, ఆరనివ్వాలి. బ్రష్ పూర్తిగా ఆరిన తర్వాత స్టోర్ చేయడం ఉత్తమం. వీలైతే బ్రష్ హెడ్‌ను కవర్ చేసే క్యాప్స్ ఉపయోగించవచ్చు, కానీ అవి వెంటిలేటెడ్ గా ఉండాలి, లేకపోతే తేమ పేరుకుపోయి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

ఇవే కాకుండా, టూత్ బ్రష్‌లను తరచూ మార్చడం కూడా చాలా ముఖ్యం. దంత వైద్యులు ప్రతి 3-4 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మార్చమని సిఫార్సు చేస్తున్నారు. అలాగే, అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత కూడా బ్రష్ మార్చడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: