
ప్రపంచం మొత్తం తిరగాలని కొందరికి ఉంటే, రకరకాల రుచులు చూడాలని మరికొందరికి ఉంటుంది. అలాంటి వాళ్ల కోసమే అన్నట్టు ఈ సూపర్ మార్కెట్ ఉంది. ఫ్యూచర్ గ్రూప్స్‌కి చెందిన అవనీ బియానీ, అప్నీ బియానీ లు కలిసి దీన్ని స్టార్ట్ చేశారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఇక్కడ క్యూ కడుతున్నారు.
సూపర్ మార్కెట్ అంటే అప్పుడప్పుడు కొన్ని రేర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉంటాయి అనుకుంటాం. కానీ ఇది వేరే లెవెల్. ఇక్కడ అన్నీ స్పెషల్ ఐటమ్సే. ప్రపంచంలో ఎక్కడా దొరకని వెరైటీ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. విదేశాల నుంచి తెప్పించిన పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం, మష్రూమ్స్ రకాలు, చాక్లెట్లు, స్వీట్స్, డ్రై ఫ్రూట్స్, మసాలాలు, చీజ్ ఫ్లేవర్స్, వాటర్ బాటిల్స్.. లిస్ట్ అంతే లేదు. అన్నీ ఇంపోర్టెడ్ ఐటమ్సే కాబట్టి ధరలు కూడా ఆకాశాన్నంటుతాయి మరి.
ఇక్కడ ఏ సీజన్‌లో అయినా అన్ని రకాల పండ్లు దొరుకుతాయి. థాయ్‌లాండ్ మ్యాంగోస్, శ్రీలంక స్ట్రాబెర్రీస్, న్యూజిలాండ్ కివీస్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఈ స్టోర్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం ఒక రేర్ పుట్టగొడుగు. దాదాపు 6 కేజీలు బరువున్న ఆ రేషీ మష్రూమ్‌ని చూస్తే షాక్ అవుతారు. దీని ధర అక్షరాలా రూ.5 లక్షలు. అంటే మామూలు పుట్టగొడుగులు కాదు ఇది, లగ్జరీ ఐటమ్ అన్నమాట.
ఇంకా ఇక్కడ థాయ్‌లాండ్ కొబ్బరి బొండం ధర కూడా వింటే గుండె గుభేల్ అనాల్సిందే. ఒక్క కొబ్బరి బొండం వెయ్యి రూపాయలు. అంత స్పెషల్ ఏముందబ్బా ఆ నీళ్లలో అనుకుంటున్నారా, మరి అంత రేట్ పెట్టారంటే ఏదో మ్యాటర్ ఉండి ఉంటుంది కదా.
చాక్లెట్ల విషయానికొస్తే.. ఇక్కడ వందల రకాల ఫారిన్ చాక్లెట్స్ ఉన్నాయి. చూడగానే నోరూరిపోతుంది. పిల్లల కోసం స్వీట్ చాక్లెట్స్, పెద్దల కోసం షుగర్ ఫ్రీ, సీ సాల్ట్, ఆర్గానిక్, ప్లాంట్ బేస్డ్ చాక్లెట్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. బ్లాక్ వాటర్ లాంటి కాస్ట్లీ వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అంతే కాదు, వందకు పైగా ఫ్లేవర్స్‌లో చీజ్ కూడా ఇక్కడ దొరుకుతుంది.
మొత్తానికి ఈ సూపర్ మార్కెట్ మాత్రం చాలా స్పెషల్. జేబు నిండా డబ్బులుంటేనే ఇటువైపు వెళ్ళండి.