
గోవాలో కొంతకాలంగా పర్యటకుల సంఖ్య తగ్గటం పై స్థానిక ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోవా బీచ్ లో ఇడ్లీ సాంబార్ .. వడ పావ్ లు అమ్మటం వల్ల విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయటం విశేషం. నార్త్ గోవాలోని ఓ కార్యక్రమంలో భాజపై ఎమ్మెల్యే మైకేల్ లోబో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. బెంగళూరు నుంచి వచ్చిన వారు బీచ్ దుకాణాలలో ఇడ్లీ సాంబార్ తో పాటు వడ పావ్ లు అమ్ముతున్నారు .. అందుకే గత రెండేళ్ళుగా గోవా కు విదేశీ పర్యాటకు సంఖ్య తగ్గిపోయింది .. దీంతో స్థానికులలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుందని మైఖేల్ పేర్కొన్నారు. అయితే పర్యాటకం పై ఇడ్లీ .. సాంబార్ అమ్మకాలు ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయి అన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ - రష్యా పర్యాటకులు కూడా గోవాకు రావడం మానేశారని మైఖేల్ చెప్పారు. గోవాలో విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గ ముఖం పట్టడానికి ప్రభుత్వం ఒక్కటే కారణం కాదని అందరూ దీనికి బాధ్యులు అని స్థానిక ఎమ్మెల్యే మైకేల్ పేర్కొన్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి గోవా లోని స్థానికులు తమ దుకాణాలను అద్దెకు ఇవ్వటంపై ఆయన మండిపడ్డారు. గోవాకు విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గటంపై కారణాలు అన్వేషించేందుకు గోవా టూరిజం శాఖతో పాటు భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా భేటీ అయి చర్చించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే మైకేల్ పేర్కొన్నారు. స్థానిక టాక్సీలు ... క్యాబ్ లు మధ్య అనేక సమస్యలు ఉన్నాయని ఈ పరిస్థితులు సరిదిద్దుకుంటే గోవా పర్యాటక రంగానికి భవిష్యత్తులో చీకటి రోజులో తప్పని ఆయన వార్నింగ్ ఇచ్చారు.