
అసలు ఏడువారాల నగలు అనగా ఏమిటి?
ముఖ్యంగా మన పూర్వీకులు గ్రహాల అనుగ్రహము కోసము, ఆరోగ్యరీత్య స్త్రీ - పురుషులు బంగారు నగలను ధరించెడివారు. ఆదివారము మొదలు శనివారము వరకు రోజుకొక విధమైన బంగారు ఆభరణములను ధరించేవారు. వీటినే 7 వారాల నగలు అంటారు. గ్రహాలకు అనుకూలముగా కంఠహారములు, కమ్మలు, గాజులు, ముక్కుపుడకలు, పాపిటబిల్ల, దండెకడెము (వంకీ), ఉంగరాలు మొదలగు ఆభరణాలను ధరించెడివారు.
ఏ రోజున ఏయే నగలు ధరించేవారంటే?
1. ఆదివారము - 'సూర్యుడు' కాబట్టి కెంపుల కమ్మలు, హారాలు మొదలగునవి ధరించేవారు.
2. సోమవారము - 'చంద్రుడు' కాబట్టి ముత్యాల హారాలు, గాజులు మొదలగునవి ధరించేవారు.
3. మంగళవారం - 'కుజుడు' కోసం పగడాల దండలు, ఉంగరాలు మొదలగునవి ధరించేవారు.
4. బుధవారం - 'బుధుడు' కోసం పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి ధరించేవారు.
5. గురువారము - 'బృహస్పతి' కాబట్టి పుష్యరాగం కమ్మలు, ఉంగరాలు మొదలగునవి ధరించేవారు.
6. శుక్రవారం - 'శుక్రుడు' కోసము వజ్రాల హారాలు, ముక్కుపుడక మొదలగునవి ధరించేవారు.
7. శనివారము - 'శని' ప్రభావం పడకుండా ఉండడం కోసం నీలమణి హారాలు మొదలగునవి.
అందుచేతనే శతాబ్దకాలం క్రితం శ్రీమంతుల ఇంట్లో మహిళలకు 7 వారాల నగలుండేవి. ఇప్పటికీ చాలామంది కోటీశ్వరుల ఇళ్లల్లో మహిళలందరికీ 7 వారాల నగలుండడం తప్పనిసరి. ముఖ్యంగా వివాహ సమయంలో వధువుకు 7 వారాల నగలు పుట్టింటి వారు కానీ, అత్తింటి వారు కానీ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఎంత బంగారం ఉన్నా ఏడు వారాల నగలకు ప్రత్యేకతే వేరు. ఏడు రోజుల పాటు ఏడు గ్రహాల అనుకూలత కోసం ఏడు వారాల నగలను ధరిస్తే అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్న మాట.!