ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు.. ఒకర్నొకరు ఆటపట్టించుకోవడం, సరదాగా ఏడిపించడం, నవ్వుకునే జోకులు.. ఆ రోజంతా ఇదే గోల. అందుకే కదా దాన్ని 'ఫూల్స్ డే' అంటాం. కానీ అసలు దీని వెనుక కథేంటి? ఎందుకొచ్చింది ఈ రోజు? అని ఎప్పుడైనా ఆలోచించారా? దీని పుట్టుక వెనుక ఒక్క కథ కాదు, బోలెడు ఇంట్రెస్టింగ్ స్టోరీలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

చాలామంది నమ్మే పాపులర్ కథ ఏంటంటే.. దీని మూలాలు ఏకంగా 16వ శతాబ్దపు ఫ్రాన్స్‌లో ఉన్నాయట. అప్పట్లో, అంటే 1582లో, పోప్ గ్రెగొరీ XIII అనే ఆయన కొత్త క్యాలెండర్ (గ్రెగోరియన్ క్యాలెండర్) తీసుకొచ్చారు. అంతకు ముందు పాత క్యాలెండర్ (జూలియన్) ప్రకారం మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదట్లో కొత్త సంవత్సరం జరుపుకునేవారు. కానీ పోప్ కొత్త క్యాలెండర్‌తో జనవరి 1ని న్యూ ఇయర్ అన్నారు. అయినా సరే, కొందరు మాత్రం పాత పద్ధతే ఫాలో అవుతూ ఏప్రిల్ 1నే న్యూ ఇయర్ చేసుకున్నారు.

ఇలా కొత్త క్యాలెండర్‌ను పట్టించుకోని వాళ్లని చూసి, మిగతావాళ్లు "ఏప్రిల్ ఫూల్స్" అని ఆటపట్టించడం మొదలుపెట్టారట. వాళ్ల మీద సరదాగా జోకులు వేయడం, ప్రాంక్‌లు చేయడం చేసేవారట. మరికొన్ని కథనాలేమో దీన్ని పురాతన రోమన్ల పండుగ 'హిలేరియా'తో ముడిపెడతాయి. మార్చి చివర్లో జరుపుకునే ఈ పండుగలో, జనాలంతా రకరకాల వేషాలు వేసుకుని, ఒకరినొకరు ఆటపట్టించుకుని, ఎగతాళి చేసుకునేవారట. ఆ నవ్వుల పండుగే కాలక్రమేణా ఏప్రిల్ ఫూల్స్ డేగా మారిపోయి ఉండొచ్చని కొందరి వాదన.

ఇంకో ఇంట్రెస్టింగ్ కథ ఉంది కానీ, ఇది నిజం కాదు, కల్పితం అని గుర్తుంచుకోండి. కూగెల్ అనే ఓ తెలివైన జోకర్ రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్‌ను మాటలతో మాయ చేసి, "ఒక్క రోజు నన్ను రాజుగా ఉంచండి" అని వరం పొందాడట. అలా రాజయ్యాక, ఆ రోజుని సరదాగా జోకులు వేసుకునే, ఆటపట్టించుకునే రోజుగా ప్రకటించాడట. ఈ కథను 1980లలో చరిత్రకారుడు జోసెఫ్ బాస్కిన్ సరదాగా ప్రచారంలోకి తెచ్చారు.

రికార్డుల ప్రకారం మొట్టమొదటి ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ 1698లో లండన్‌లో జరిగిందట. కొందరు అల్లరి వ్యక్తులు "టవర్ ఆఫ్ లండన్‌లో సింహాలకు స్నానం చేయిస్తున్నారు, రండి చూడండి" అని జనాలకు కబురు పంపి పిలిపించి, తీరా వాళ్లు వచ్చాక అక్కడ ఏమీ లేదని చెప్పి ఫూల్స్ చేశారట.

అలా అలా శతాబ్దాలు గడిచే కొద్దీ, ఈ సరదా సంప్రదాయం ప్రపంచమంతా పాకిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా, ఎలాంటి హాని తలపెట్టకుండా నవ్వుకోవడానికి, సరదాగా ఒకరినొకరు ఆటపట్టించుకోవడానికి ఈ రోజును వాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: