భగభగ మండే ఎండలు, ఉక్కపోతతో శరీరం అల్లాడిపోతోంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే, అనారోగ్యాలు తలుపు తట్టడం ఖాయం. మీ డైట్ విషయంలో కొన్ని మార్పులు చేసుకోకపోతే, వేసవి తాపం మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

వేసవి వచ్చిందంటే చాలు మన శరీరం తేలికపాటి ఆహారాన్ని కోరుకుంటుంది. జీర్ణవ్యవస్థపై భారం పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. నూనెలో దేవురించిన వేపుళ్లు, మసాలా ఘాటు ఆహారాలు తినకూడదు. నోటికి రుచిగా ఉన్నా, ఇవి శరీరంలో వేడిని విపరీతంగా పెంచుతాయి. జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలకు ఇవి ప్రధాన కారణం. వేయించిన చికెన్, మసాలా కర్రీలు, బజ్జీలు, పకోడీలు వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

అతిగా మాంసాహారం, ముఖ్యంగా రెడ్ మీట్ వంటివి జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం, ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. వేసవిలో మాంసాహారాన్ని బాగా తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం ఉత్తమం. నిల్వ పచ్చళ్లు అంటే ఊరగాయల్లో ఉప్పు, కారం, నూనె అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని తగ్గించి, వేడిని పెంచుతాయి. వీటిని కేవలం రుచికి మాత్రమే, అదీ చాలా పరిమితంగా తీసుకోవాలి.

కూల్ డ్రింక్స్, చక్కెర పానీయాలు సైతం చల్లగా అనిపించినా, వీటిలోని అధిక చక్కెరలు, రసాయనాలు శరీరానికి హానికరం. ఇవి తాత్కాలికంగా దాహం తీర్చినట్లు అనిపించినా, డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి. శక్తిని కూడా హరిస్తాయి. టీ, కాఫీల్లో కెఫిన్ ఎక్కువగా ఉండే ఈ పానీయాలు కూడా శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి (డైయూరెటిక్ లక్షణాలు). వీటిని కూడా పరిమితం చేసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

వేసవిలో మీ ప్లేట్‌లో ఉండాల్సినవి చలువ చేసే ఆహారాలు. శరీరాన్ని చల్లగా, శక్తివంతంగా ఉంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం కీలకం. ఉదయం పూట ఆవిరిపై ఉడికించిన ఇడ్లీ, దోశ (తక్కువ నూనెతో), ఉప్మా, పొంగల్ వంటివి తీసుకోండి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి, రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి సహకరిస్తాయి.

తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలు, సొరకాయ, బీరకాయ, దోసకాయ వంటి నీటిశాతం అధికంగా ఉండే కూరగాయలను భోజనంలో భాగం చేసుకోండి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజ లవణాలను అందించి, శరీరాన్ని చల్లబరుస్తాయి. ప్రకృతి ప్రసాదించిన మామిడి పండ్లు, పుచ్చకాయలు, కర్బూజాలు, తాటి ముంజలు, ద్రాక్ష వంటి పండ్లను ఎక్కువగా తినండి. ఇవి డీహైడ్రేషన్‌ను నివారించి, తక్షణ శక్తిని అందిస్తాయి.

మజ్జిగ (ఉప్పు, జీలకర్ర పొడితో), కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, చెరుకు రసం, బార్లీ నీళ్లు వంటి సహజసిద్ధమైన పానీయాలు తాగండి. ఇవి శరీరంలోని లవణాలను సమతుల్యం చేసి, వడదెబ్బ నుంచి కాపాడతాయి. పెరుగును కూడా మీ ఆహారంలో భాగం చేసుకోండి. వేసవిలో ఆహార నియమాలు పాటిస్తే, ఈ సీజన్‌ను హాయిగా, ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: