అలారం మోగకముందే సెల్‌ఫోన్ స్క్రీన్ వెలుగుతోంది.. రాత్రి కళ్లు మూసే క్షణం వరకు అదే ప్రపంచం. అవును, మన జీవితాల్లో సెల్‌ఫోన్ ఓ విడదీయరాని బంధమైపోయింది, కాదు కాదు. ఓ వ్యసనంగా మారిపోయింది. ఒకప్పుడు ఫోన్ అంటే అవతల మనిషి గొంతు వినడానికే.. కానీ ఇప్పుడో? మాటల కంటే ఎక్కువగా కెమెరా క్లిక్కులు, యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా స్క్రోలింగ్‌కే మన వేళ్లు అంకితమైపోతున్నాయి. ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ అదో రకమైన అభద్రతా భావం.

సరే, పగటి పూట కథ ఎలా ఉన్నా.. రాత్రి వేళల్లో కూడా ఈ డిజిటల్ మత్తు వదలడం లేదు. గాఢ నిద్రలోకి జారుకోవాల్సిన సమయంలోనూ మన కళ్లు ఆ బ్లూ లైట్ తెరల వైపే చూస్తున్నాయి. 'ఒక్క నిమిషం చూసి పడుకుందాంలే' అనుకునే ఆ క్షణమే మన నిద్రకు యమపాశం అవుతోందని నిపుణులు లబోదిబోమంటున్నారు. ఆ ఫోన్ స్క్రీన్ వెలుగులు నేరుగా మన కళ్లపైనే కాదు, మన మొత్తం ఆరోగ్యంపైనే దాడి చేస్తున్నాయి.

టెక్నికల్‌గా చెప్పాలంటే మొబైల్, ల్యాప్‌టాప్ వంటి డిజిటల్ స్క్రీన్ల నుంచి వెలువడే నీలి కాంతి కిరణాలు (బ్లూ లైట్) మన మెదడును పగలే అని భ్రమింపజేస్తాయి. మనల్ని నిద్రపుచ్చే 'మెలటోనిన్' అనే సహజ హార్మోన్ ఉత్పత్తికి ఈ బ్లూ లైట్ బ్రేకులు వేస్తుంది. ఈ హార్మోన్ మన శరీరానికి 'ఇక నిద్రపోవాల్సిన సమయం వచ్చింది' అని చెప్పే సిగ్నల్ లాంటిది. దాని ఉత్పత్తి ఆలస్యమైతే, ఇక నిద్ర పట్టడం గగనమే.

ఇది ఏదో ఆషామాషీగా చెబుతున్న మాట కాదు. ఏకంగా 45 వేల మందిపై జరిపిన ఓ భారీ అధ్యయనంలో నిగ్గుతేలిన నిజం ఇది. ముఖ్యంగా 18 నుంచి 28 ఏళ్ల యువతలో ఈ సమస్య పెనుభూతంలా మారిందని తేలింది. వారిలో చాలామంది చెప్పిందేంటంటే.. రాత్రి పడుకునే ముందు కేవలం గంట సేపు ఫోన్ స్క్రీన్ చూస్తే చాలు, ఆ రాత్రికి నిద్ర దూరమైపోతోందని. సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 59% మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నామని వాపోయారు.

నిద్రకు ముందు కనీసం 30 నిమిషాల పాటు సోషల్ మీడియాలో మునిగితేలే వారిలో నిద్రలేమి, నిద్రలో కలత చెందడం, మధ్యమధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలు 1.62 రెట్లు ఎక్కువగా దాడి చేస్తున్నాయని గతంలోనే పరిశోధకులు హెచ్చరించారు. అంటే, మన చేతిలో ఉన్న ఫోనే మన ప్రశాంతమైన నిద్రకు శత్రువుగా మారుతోందన్నమాట.

నిద్రలేమి అంటే కేవలం ఆ రాత్రికి ఇబ్బంది పడటం కాదు. దీర్ఘకాలంలో ఇది ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, మానసిక ఆందోళన, కుంగుబాటు వంటి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మన పనితీరు దెబ్బతింటుంది, ఏకాగ్రత లోపిస్తుంది, చిరాకు పెరుగుతుంది.

కాబట్టి, రాత్రి వేళల్లో మీ సెల్‌ఫోన్‌ను బెడ్‌రూమ్ బయటే వదిలేయడం ఉత్తమం. మీ కళ్లకు, మెదడుకు విశ్రాంతినివ్వండి. పుస్తకం చదవడం, సంగీతం వినడం వంటివి అలవాటు చేసుకోండి. స్క్రోలింగ్ ఆపి, స్లీపింగ్‌పై దృష్టి పెట్టండి. లేదంటే, రేపటి మీ ఆరోగ్యకరమైన జీవితాన్ని మీ చేతులతో మీరే ఈ రాత్రి బ్లూ లైట్‌కు బలి చేస్తున్నట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: