వైసీపీ ఆవిర్భవించాక రెండుసార్లు సాధారణ ఎన్నికల బరిలో నిలిచింది. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసింది. 2014లో ప్రతిపక్షానికి పరిమితం కాగా, 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి, అధికారం దక్కించుకుంది. అయితే ఈ రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అలా రెండుసార్లు వైసీపీ విజయం దక్కించుకున్న నియోజకవర్గాల్లో విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం ఒకటి.
ఈ నియోజకవర్గం నుంచి బూడి ముత్యాలనాయుడు వైసీపీ తరుపున విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి గవిరెడ్డి రామనాయుడుపై విజయం సాధించారు. మామూలుగా అయితే ఈ నియోజకవర్గం టీడీపీకి అనుకూలంగా ఉండేది. కానీ కాంగ్రెస్ లో రాజకీయ జీవితం మొదలుపెట్టిన ముత్యాలనాయుడు...తర్వాత వైసీపీలోకి వచ్చి వరుసగా గెలిచారు. జగన్ ఇమేజ్ తో పాటు, సొంత ఇమేజ్ కూడా తోడు కావడంతో మాడుగుల నియోజకవర్గం వైసీపీ కంచుకోటగా మారిపోయింది.
ఇక రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముత్యాలనాయుడు...ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేసుకుంటూ వెళుతున్నారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే నియోజకవర్గంలో ఇంకా అనుకున్న మేర అభివృద్ధి జరగలేదు. అటు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే...ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, మెజారిటీ స్థానాలు ఆ పార్టీ ఖాతాలోనే పడటం ఖాయం. నియోజకవర్గంలో మాడుగుల, చీడికాడ, దేవరపల్లె, కె.కోటపాడు మండలాలు ఉన్నాయి.
అటు టీడీపీ విషయానికొస్తే..ఇక్కడ ఇన్ చార్జ్ గా గవిరెడ్డి రామానాయుడు ఉన్నారు. ఆయన కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. రెండుసార్లు 10 వేల లోపే మెజారిటీతో ఓడిపోవడంతో, ఇంకా కష్టపడి పని చేస్తూ...నెక్స్ట్ ఎన్నికల్లో అయిన ముత్యాలనాయుడుకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ వైసీపీ బలంగా ఉండటంతో, ముత్యాలనాయుడుని ఓడించడం అంత సులువు కాదు. ఏదేమైనా మాడుగుల వైసీపీకి కంచుకోటగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.