కారుమూరి నాగేశ్వరరావు... పశ్చిమగోదావరి జిల్లా తణుకు వైసీపీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ లో రాజకీయ జీవితం మొదలుపెట్టిన కారుమూరి... 2006-2009 వరకు వెస్ట్ గోదావరి జిల్లా చైర్‌పర్సన్‌గా పనిచేశారు. తర్వాత 2009లో తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఐదేళ్లు నియోజకవర్గ ప్రజలకు మంచిగానే సేవలు అందించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందే ఉన్నారు.
అయితే తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో, ఆయన కాంగ్రెస్‌ని వీడి వైసీపీలోకి వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో తణుకు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్ధి అరిమిల్లి రాధాకృష్ణపై 2 వేల మెజారిటీతో విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన కారుమూరి...నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
ప్రతిరోజూ నియోజకవర్గంలో ఏదొక గ్రామంలో పర్యటిస్తూనే ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందిస్తున్నారు. అటు ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలయ్యేలా చూసుకుంటున్నారు. కాకపోతే అభివృద్ధి విషయంలో కాస్త వెనకపడి ఉన్నారు. గత ఐదేళ్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న అరిమిల్లి అధ్వర్యంలో తణుకు బాగానే అభివృద్ధి చెందింది.
అయితే జగన్ గాలి ఉండటం వల్ల అరిమిల్లి 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం టీడీపీ ఇన్ చార్జ్‌గా ఉంటూ, పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రభుత్వంపై పోరాటాలు చేసే విషయంలో ముందుంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా అరిమిల్లి-కారుమూరిలే మళ్ళీ పోటాపోటిగా తలపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
కాకపోతే ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉండటం, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండటం కారుమూరికి అడ్వాంటేజ్‌గా ఉంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీకే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశముంది. అయితే టీడీపీ కూడా కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇస్తుంది.