ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పువ్వాడ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కమ్యూనిస్టు నేత పువ్వాడ నాగేశ్వరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనయుడు పువ్వాడ అజయ్‌కుమార్ 2009 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన తుమ్మల నాగేశ్వరరావును ఓడించారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి టీఆర్ఎస్ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి ఆయన నామా నాగేశ్వరరావును ఓడించారు. జిల్లా రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తోన్న ఇద్దరు కీలక నేతలను రెండు ఎన్నికల్లో ఓడించిన వ్యక్తిగా పువ్వాడ రికార్డు క్రియేట్ చేశారు. ఇక రెండోసారి గెలిచాక కొద్ది రోజులకు ఆయనకు కేసీఆర్ తన కేబినెట్లో రవాణా శాఖా మంత్రి పదవి ఇచ్చారు.
ఇక పువ్వాడ ఏ ముహూర్తాన మంత్రి అయ్యారో ఆయనకు వరుసగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన మంత్రి అయిన వెంటనే ఒక్కసారిగా ఆర్టీసీ సమ్మె రావడంతో ఆయనకు ఇబ్బందులు తప్పలేదు. మంత్రి అయిన వెంటనే ఆర్టీసీ సమ్మె రావడంతో కాస్త ఇబ్బంది పడ్డారు. కేసీఆర్ ముందు ఆర్టీసీ సమ్మె విషయంలో పూర్తి వ్యతిరేకతతో వెళ్లడంతో పాటు అన్నీ ఆయనే నిర్ణయాలు తీసుకోవడంతో అప్పుడు పువ్వాడకు శాఖలో పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. తర్వాత కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు వరాలతో ఆ సమ్మెను సైలెంట్ చేయడంతో పువ్వాడ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పుడు కరోనా నేపథ్యంలో పువ్వాడ పెద్దగా బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. ఆయన మంత్రి అయిన ఏడెనిమిది నెలలుగా శాఖా పరంగా పెద్దగా సాధించింది లేదు... శాఖలో ఆయన మార్క్ అయితే లేదు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని కింగ్ :
ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అజయ్ ఏకచక్రాధిపత్యంగా రాజకీయం చేస్తున్నారు. కేటీఆర్ ఆయనకు ఫుల్‌గా సపోర్ట్ చేస్తుండడంతో ఆయనకు తిరుగులేదు. ఆయన చెప్పిందే వేదంగా నడుస్తోంది. జిల్లాలో కీలక పదవులు, జిల్లా స్థాయి పదవులు అన్నీ కూడా పువ్వాడ అనుచరులకే దక్కుతున్నాయి. ఈ విషయంలో మరో ఎమ్మెల్యే మాటకు కూడా ప్రయార్టీ ఉండడం లేదన్నది వాస్తవం. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా ఉన్న పువ్వాడ నగర అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వేలాది కోట్లతో ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. నగరం అంతా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, కలెక్టరేట్, నగర కార్పొరేషన్ కార్యాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టడంతో పాటు లకారం చెరువును అభివృద్ధి చేసి అక్కడ ట్యాంక్ బండ్‌గా డవలప్ చేయడంతో నగర వాసులు పువ్వాడ పనితీరును మెచ్చుకుంటున్నారు. ఇక నగర సుందరీకరణ విషయంలో కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నగరంలోనే పెద్ద మురికి కాల్వ అయిన గోళ్లపాడు కాల్వను అభివృద్ధి విషయంలో పువ్వాడ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా ఆయనకు ప్లస్ కానుంది.
జిల్లాలో గ్రూపు తగాదాల గోల :
మాజీ మంత్రి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు హవాకు పువ్వాడ గండికొట్టేశారు. ఇప్పుడు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పువ్వాడ హవానే నడుస్తోంది. అయితే ఇదే టైంలో తుమ్మలతో ఆయనకు పైకి కనపడని విబేధాలు ఉన్నాయి. అలాగే ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం తన వర్గాన్ని తాను పెంచి పోషించుకుంటున్నారు. వైరా, పాలేరు ఎమ్మెల్యేలు ఇద్దరూ మాజీ ఎంపీ పొంగులేటి అనుచరులుగానే ఉంటారు. తుమ్మల పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కేటీఆర్ సపోర్టుతో జిల్లా స్తాయి పదవులు అన్నీ పువ్వాడ తన అనుచరులకే ఇప్పించుకోవడంతో మిగిలిన ఎమ్మెల్యేలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. మాజీ మంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కూడా పువ్వాడకు అంత సఖ్యత లేదని టాక్..? ఇక ఎంపీ నామా నాగేశ్వరరావుతో లోపల చిన్నా చితకా సమస్యలు ఉన్నా పైకి మాత్రం సఖ్యతతో ఉన్నట్టు కలరింగ్ ఉంటుంది. ఏదేమైనా ఈ రెండు జిల్లాల్లో కేటీఆర్ అండదండలతో పువ్వాడ జబర్దస్త్ రాజకీయం చేసుకుంటూ దూసుకు పోతున్నారు.