
రాజకీయాల్లో అదృష్టం కలిసిరాని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే..అది టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డినే. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి 1994,1999 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సోమిరెడ్డి...2004,2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలవుతూ వస్తున్నారు. అయితే చివరి రెండు ఎన్నికల్లో సోమిరెడ్డికి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి చెక్ పెడుతూ వస్తున్నారు.
2014లో 5 వేల పైనే మెజారిటీతో గెలిచిన కాకాణి...2019 ఎన్నికల్లో 13 వేల మెజారిటీతో గెలిచారు. అయితే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన కాకాణి...తనదైన శైలిలో పని చేసుకుంటూ వెళుతున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. ప్రభుత్వ పథకాలు కూడా బాగానే అందుతున్నాయి. ఇక ప్రతిపక్ష టీడీపీపై విరుచుకుపడే నేతల్లో కాకాణి ముందు వరుసలో ఉన్నారు. అయితే సొంత పార్టీలోనే విభేదాలు కాకాణికి తలనొప్పిగా ఉన్నాయి. మంత్రి అనిల్‌కు కాకాణికి పెద్దగా పడటం లేదు. అలాగే నియోజకవర్గంలో దందాలు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది.
అటు నియోజకవర్గంలో పెద్ద అభివృద్ధి కూడా జరిగింది ఏమి లేదు. గత ఐదేళ్లు మంత్రిగా ఉండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డినే ఎక్కువ అభివృద్ధి చేశారు. అదే అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తోంది. ఆయన ఓడిపోయారు గానీ...నియోజకవర్గానికి బాగానే పనులు చేసి పెట్టారు. ఇప్పుడు ఓడిపోయినా...నియోజకవర్గంలోనే ఉంటూ పనిచేసుకుంటున్నారు. అధికార వైసీపీ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. చంద్రబాబుకు అండగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా సోమిరెడ్డినే మరోసారి పోటీ చేసే అవకాశముంది.
కానీ నియోజకవర్గంలో వైసీపీ ఇంకా బలంగానే ఉంది. కాకాణి కూడా బలమైన నాయకుడుగా ఎదుగుతున్నారు. నియోజకవర్గంలో సోమిరెడ్డికి స్కోప్ లేకుండా చేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో అభివృద్ధి చేసే విషయంలో సోమిరెడ్డికి, కాకాణికి చాలా తేడా ఉంది. గత ఐదేళ్లు సోమిరెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగానే అభివృద్ధి పనులు చేశారు. సోమిరెడ్డి ఎంత చేసినా..సర్వేపల్లి ప్రజలు మాత్రం వైసీపీ వైపే ఉన్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీకే మెజారిటీ సీట్లు వస్తాయి. మరి వచ్చే ఎన్నికలనాటికి సోమిరెడ్డి పుంజుకుని... కాకాణికి చెక్ పెడతారేమో చూడాలి.