2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలవడానికి ఏకైక కారణం జగన్. ఆయన ఇమేజ్‌తోనే మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించగలిగారు. అయితే జగన్ ఇమేజ్ కాకుండా అతి తక్కువ మంది ఎమ్మెల్యేలు మాత్రమే సొంత ఇమేజ్‌తో గెలిచారు. అలా సొంత ఇమేజ్‌తో గెలిచిన ఎమ్మెల్యేల్లో కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు.

 

అసలు పాణ్యం అంటే కాటసాని అడ్డా అని మొహమాటం లేకుండా చెప్పేయొచ్చు. ఎందుకంటే మూడు దశాబ్దాల నుంచి ఇక్కడ మరొక ఎమ్మెల్యే గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. కేవలం 1999లో టీడీపీ అభ్యర్ధి బిజ్జం పార్థసారథి రెడ్డి గెలవగా, 2014లో గౌరు చరితా రెడ్డి వైసీపీ నుంచి విజయం సాధించారు. ఇక 1985, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో కాటసాని కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నిలబడి దాదాపు 60 వేల ఓట్లు తెచ్చుకుని గౌరు చరితా చేతిలో 12 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ టీడీపీ మూడోస్థానంలో నిలవడం గమనార్హం.

 

అయితే కాటసాని 2014 ఎన్నికలయ్యాక బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇక 2019 ఎన్నికల ముందు ఆయన వైసీపీలోకి వచ్చారు. దీంతో 2014లో వైసీపీ తరుపున గెలిచిన చరితా… టిక్కెట్ దక్కదనే ఉద్దేశంతో టీడీపీలోకి వచ్చేశారు. దీంతో  2019 ఎన్నికల్లో చరితా టీడీపీ తరుపున బరిలో ఉంటే, కాటసాని వైసీపీ నుంచి పోటీ చేశారు. అసలు ఇండిపెండెంట్‌గా నిలబడితేనే కాటసాని ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. అలాంటప్పుడు వైసీపీలో నిలబడిన కాటసానికి లక్షా 22 వేల ఓట్లు వచ్చాయి. ఇక చరితా రెడ్డికి 78 వేలు ఓట్లు మాత్రమే పడ్డాయి.

 

మొత్తానికి కాటసాని 43 వేల మెజారిటీతో తెచ్చుకుని ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచేశారు. ఇక పాణ్యంలో ప్రతి ఇంచు కాటసానికి తెలుసు. దీంతో ఏ సమస్య ఉన్నా సులువుగా పరిష్కరిస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగానే అందుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు నిదానంగా జరుగుతున్నాయి. ఇక పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలం సాగు, తాగునీటి కష్టాలు తీర్చే మల్లిఖార్జున స్వామి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేలా చూడాలని ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు.

 

అయితే కాటసానికి వయసు మీద పడటంతో కాస్త దూకుడు తగ్గించినట్లు తెలుస్తోంది. కాకపోతే ఆయన ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఇక్కడ టీడీపీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎన్నికల్లో ఓడిపోయిన చరితా అడ్రెస్ లేరు. ఒకవేళ టీడీపీ తరుపున ఆమె పనిచేసిన కూడా పెద్ద ఉపయోగం లేదు. ఇప్పటికే టీడీపీ కేడర్ పెద్ద ఎత్తున వైసీపీలోకి వెళ్లిపోయింది. ఇక కాటసాని ఉన్నంత వరకు పాణ్యంలో టీడీపీ విజయం దక్కడం కష్టం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతంపైనే సీట్లు వైసీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: