పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి...దివంగత వైఎస్సార్ బామ్మర్ది. ఏపీ సీఎం జగన్ మేనమామ. కడప జిల్లా వైఎస్సార్‌సీపీలో ఉన్న బలమైన నాయకుడు. వైఎస్సార్ చొరవతో రాజకీయాల్లోకి వచ్చిన రవీంద్రనాథ్..2005లో కడప కార్పొరేషన్ మేయర్‌గా గెలిచారు. అలాగే కడప జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇక తర్వాత వైఎస్సార్ మరణంతో మేనల్లుడు జగన్ పెట్టిన వైఎస్సార్‌సీపీలోకి వచ్చేశారు.
2014 ఎన్నికల్లో తొలిసారి కమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి, అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసిన పుత్తా నరసింహారెడ్డిపై 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ, జగన్‌కు అండగా నిలబడ్డారు. అలాగే అప్పటి టీడీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేశారు. గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తిచేయాలని నిరవధిక నిరాహార దీక్ష చేశారు.
ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసిన రవీంద్ర...2019 ఎన్నికల్లో మరోసారి కమలాపురం నుంచి గెలిచి సత్తా చాటారు. ఈసారి కూడా పుత్తాపైనే 27 వేల ఓట్ల తేడాతో గెలిచారు. పైగా తన మేనల్లుడు జగన్ కూడా సీఎం అవ్వడంతో, రవీంద్ర నియోజకవర్గంలో దూసుకెళుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుని నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కొత్తగా సచివాలయాలు, సిసి రోడ్లు, అండర్ డ్రైనేజ్ నిర్మాణాలు చేస్తున్నారు.
గాలేరు-నగరి సుజల స్రవంతి ఫేజ్-2లో భాగంగా ప్యాకేజీ 1, ప్యాకేజీ 2 జలయజ్ఞం పనులకు రూ.650 కోట్లతో టెండర్లు పిలవగా, త్వరలో పనులు మొదలుకానున్నాయి. కొత్తగా పాగేరు వంక వంతెన నిర్మాణం చేపట్టారు. రూ.567 కోట్లతో ప్రతి ఇంటికి గండికోట నుంచి తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారు. అభివృద్ధితో పాటు ప్రభుత్వ పథకాలు కూడా బాగానే అందుతున్నాయి.
ఇక పార్టీల పరంగా చూసుకుంటే కమలాపురంలో జగన్ మేనమామకు ఎదురులేదనే చెప్పాలి. కమలాపురం వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట కావడంతో, భవిష్యత్‌లో ఎక్కువశాతం గెలుపు రవీంద్ర వైపే ఉంటుంది. అటు టీడీపీ తరుపున పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు. ఈయన గత నాలుగు పర్యాయాల నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోతున్నారు. ప్రస్తుతానికైతే ఈయన సైలెంట్ అయిపోయారు. అటు కమలాపురం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వీరశివారెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున దక్కలేదని చెప్పి, ఎన్నికలైపోయాక టీడీపీని వదిలేసి వైఎస్సార్‌సీపీలోకి వచ్చేశారు. దీంతో కమలాపురంలో టీడీపీకి దిక్కులేకుండాపోయింది. ఇలా టీడీపీ వీక్ అయిపోవడంతో రవీంద్రనాథ్ రెడ్డికి తిరుగులేకుండా పోయింది.