సినిమాల్లో నుంచి వచ్చి రాజకీయాల్లో సక్సెస్ అయిన వారిలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా ఒకరు. టీడీపీ ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టిన రోజా తొలిసారి 2004 ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినా కూడా పార్టీ కోసం కష్టపడి, అప్పటి అధికార కాంగ్రెస్‌పై పోరాటాలు చేసి ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఎదిగారు. అదే క్రమంలో 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

 

దీంతో టీడీపీలో రోజా ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. పైగా చంద్రబాబు తనకు కావాలనే ఓడిపోయే సీటు ఇచ్చారని చెబుతూ రోజా, టీడీపీకి దూరమయ్యారు. కాంగ్రెస్‌లో చేరాలనే ఉద్దేశంతో వైఎస్‌ని కూడా కలిశారు. కానీ ఆ తర్వాత వైఎస్ మరణించడం, జగన్ వైఎస్సార్‌సీపీ పెట్టడంతో ఆమె అందులోకి వెళ్లిపోయారు. ఇక 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరుపున నగరి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై కేవలం 858 ఓట్ల తేడాతో గెలిచి, తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

 

అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూనే, చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మరోసారి నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఈసారి గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్‌పై 2,708 ఓట్ల తేడాతో గెలిచారు. పైగా వైఎస్సార్‌సీపీ కూడా అధికారంలోకి రావడంతో, రోజా దూసుకెళుతున్నారు. అటు నగరిలో పనులు చేసుకుంటూనే, ఇటు ప్రతిపక్ష టీడీపీపై విరుచుపడుతూ ఉన్నారు.

 

నగరిలోనే సమస్యలని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నారు. కొత్తగా సి‌సి రోడ్లు, అండర్ డ్రైనేజ్, సచివాలయాలు, బస్ షెల్టర్‌ల నిర్మాణాలు చేపట్టారు. అటు నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు. ఇంకా లాక్ డౌన్ సమయంలో తన సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి పేదలని ఆదుకున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు ఎలాంటి లోటు లేకుండా అందిస్తున్నారు.

 

అయితే పనితీరు పరంగా అంతా బాగానే ఉన్నా, రోజాకు సొంతపోరుతోనే ఎక్కువ తలనొప్పి ఎదురవుతుంది. నగరిలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలు పెత్తనం చేయాలని చూడటం రోజాకు నచ్చట్లేదు. ఇప్పటికే తన పర్మిషన్ లేకుండా నగరిలో ఎవరు కాలుపెట్టడానికి వీల్లేదని రోజా వార్నింగ్ ఇచ్చారు. జగన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. కానీ మంత్రి పెద్దిరెడ్డి మాత్రం నగరిలో రోజాకు వ్యతిరేకంగా గ్రూప్ రాజకీయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

పెద్దిరెడ్డి అండతో మాజీ మంత్రి చెంగారెడ్డి సోదరుడు కుమారుడు చక్రపాణిరెడ్డి నగరిలో కాస్త హడావిడి చేస్తున్నారని టాక్. రోజా కూడా ఈ సొంతపోరుకు గట్టిగానే చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇక్కడ టీడీపీ తరుపున గాలి భాను ప్రకాష్ యాక్టివ్‌గానే పనిచేసుకుంటున్నారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, పార్టీని బలోపేతం చేయడానికి చూస్తున్నారు. అయితే భాను ప్రకాష్‌కు కూడా ఇంటి పోరు ఎక్కువగానే ఉంది. భాను ప్రకాష్‌కు సోదరుడు గాలి జగదీష్ చెక్ పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే నగరిలో ప్రత్యర్ధులుగా ఉన్న రోజా, భాను ప్రకాష్‌లకు సొంత పోరుతోనే పెద్ద ఇబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: