2019 ఎన్నికల్లో చాలామంది జూనియర్ నాయకులు వైఎస్సార్సీపీ తరుపున బరిలో దిగి టీడీపీ సీనియర్ నేతలని మట్టికరిపించారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేలు గెలిచిన ఆ నాయకులు, మళ్ళీ ఆ సీనియర్ నేతలని కోలుకొనివ్వకుండా చేస్తున్నారు. అలా సీనియర్ నేతలకు ఎన్నికల్లో చుక్కలు చూపించిన జూనియర్ నేతల్లో చిత్తూరు జిల్లాకు చెందిన నల్లప్పగారి వెంకటేగౌడ కూడా ఒకరు. పలమనేరు నుంచి తొలిసారి పోటీ చేసిన వెంకటే..టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని చిత్తుగా ఓడించారు.
దాదాపు 32 వేల ఓట్ల పైనే మెజారిటీతో వెంకటే గెలిచి సత్తా చాటారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గౌడ, నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు. యువకుడు కావడంతో నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి లోటు రానివ్వడం లేదు. అలాగే నియోజకవర్గంలో కొత్తగా సిసి రోడ్లు, అండర్ డ్రైనేజ్, వంతెనలు, సచివాలయ నిర్మాణాలు చేపడుతున్నారు.
అయితే దూకుడుగా పనిచేస్తున్న వెంకటే చుట్టూ వివాదాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. మొన్న ఆ మధ్య లాక్ డౌన్ నింబంధనలని ఉల్లఘించి మరీ ఓ వంతెన ప్రారంభోత్సవం చేశారు. దీంతో ఆయనని మీడియా ఏకీపారేసింది. లాక్ డౌన్ సమయంలో సామాజిక దూరం పాటించకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏంటని, పలు మీడియా ఛానళ్ళు వెంకటేపై విమర్శలు చేశాయి. ఈ విమర్శలపై వెంకటే కూడా ఘాటుగానే స్పందించారు. ఈ వార్తను ప్రసారం చేసినందుకు పలు మీడియా సంస్థలపై బూతు పురాణం అందుకున్నారు. నోటికొచ్చిన మాటలు అనేశారు. ఈ అంశంలో వెంకటేకు కాస్త చెడ్డ పేరు వచ్చిందనే చెప్పుకోవచ్చు.
ఇక ఇక్కడ టీడీపీని అమర్నాథ్ రెడ్డి నడిపిస్తున్నారు. 2014లో వైఎస్సార్సీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్, తర్వాత టీడీపీలోకి వచ్చి మంత్రి అయ్యారు. మంత్రిగా నియోజకవర్గంలో మంచిగానే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ప్రతిపక్షంలోనే ఉంటూ, ప్రజల తరుపున పోరాడుతున్నారు. అయితే వెంకటే బాగా దూకుడుగా ఉండటంతో అమర్నాథ్ పలమనేరులో పుంజుకున్నట్లు కనిపించడం లేదు. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే భవిష్యత్లో సీనియర్ నేతగా ఉన్న అమర్నాథ్కు జూనియర్ ఎమ్మెల్యే అయిన వెంకటే గౌడ మళ్ళీ చెక్ పెట్టేసేలా ఉన్నారు.