
ఇలా ఫైర్ బ్రాండ్ నాయకుడుగా ముద్రవేసుకున్న జోగి...రాజకీయ జీవితం కాంగ్రెస్‌లో మొదలైంది. వైఎస్సార్ అండతో తొలిసారి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తర్వాత వైఎస్సార్ మరణించడం, జగన్ వైసీపీ పెట్టడంతో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఇదే క్రమంలో 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి, దేవినేని ఉమా చేతిలో ఓటమి పాలయ్యారు.
ఓడిపోయినా కూడా నిత్యం చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే వచ్చారు. జగన్‌కు అండగా నిలబడ్డారు. ఇక 2019 ఎన్నికల్లో మళ్ళీ పెడన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి, పెడన నియోజకవర్గంలో దూసుకెళుతున్నారు. ప్రభుత్వ పథకాలని ఎలాంటి లోటు లేకుండా అందిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు సైతం పథకాలు అందేలా చేస్తూ, మరింత మద్ధతు పెంచుకుంటున్నారు.
అలాగే నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు. నియోజకవర్గంలో కొత్తగా సిసి రోడ్లు, అండర్ డ్రైనేజ్ నిర్మాణాలు చేయిస్తున్నారు. కరోనా, లాక్‌డౌన్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకు అండగా ఉంటున్నారు. ఇక అసెంబ్లీలో గానీ, మీడియా ముందు గానీ జోగి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు. అసలు కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలకు కౌంటర్లు ఇచ్చే వారిలో జోగి ముందుంటారు.
అయితే ఎమ్మెల్యేగా, అధికార పార్టీ నేతగా మంచి పనితీరు కనబరుస్తున్న జోగి మంత్రి పదవిపైన బాగానే ఆశ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గౌడ/శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి సుభాష్ స్థానంలో తనకు పదవి వస్తుందని జోగి ఆశించారు. కానీ జగన్ అనూహ్యంగా అదే సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల్‌కు కేబినెట్‌లో చోటు కల్పించారు. దీంతో జోగి మంత్రి పదవి మిస్ అయింది. మరి చూడాలి నెక్స్ట్ కేబినెట్ విస్తరణలోనైనా జోగికి పదవి వస్తుందో..లేక మళ్ళీ మిస్ అవుతుందో.