కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం...టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం అంటే 1983 ఎన్నికల నుంచి చూసుకుంటే ఇక్కడ ఎక్కువసార్లు టీడీపీనే గెలిచింది. 1983, 1985, 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్ధులదే విజయం కేవలం 1989లో మాత్రం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఇలా టీడీపీకి కంచుకోటగా ఉన్న నందిగామలో 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున మొండితోక జగన్ మోహన్‌రావు ఊహించని విజయం సాధించారు.

10 వేల ఓట్ల మెజారిటీతో తంగిరాల సౌమ్యపై గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ మోహన్, నందిగామలో దూసుకెళుతున్నారు. నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ పథకాలని అందరికీ అందేలా చేస్తున్నారు. ఆఖరికి టీడీపీ కార్యకర్తలకు సైతం ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న తాగునీటి సమస్యలని పరిష్కరిస్తున్నారు.

ఇంకా నందిగామలో ప్రధానంగా ఉన్న సుబాబుల్ రైతుల సమస్యలకు చెక్ పెడుతున్నారు.  వారికి మద్ధతు ధర దక్కేలా చేస్తున్నారు. సుబాబుల్ రైతుల బకాయిలని ప్రభుత్వమే చెల్లించేలా చొరవ చూపారు. రైతులకు కాగిత పరిశ్రమ చెల్లించాల్సిన రూ.2.37 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల వద్ద నుండి ఎస్‌పి‌ఎం పరిశ్రమ సుబాబుల్ కొనుగోలు చేసి 281 మంది రైతులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా కాలయాపన చేసింది. తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోలేదు. చివరికి జగన్ ప్రభుత్వం ఆ బకాయిలని చెల్లించింది.

ఈ కరోనా సమయంలో కూడా ప్రజలకు అండగా ఉంటున్నారు. స్వతహాగా డాక్టర్ కావడంతో ప్రజల ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అటు వరదల వల్ల ఇబ్బందులు ప్రజలని ఆదుకుంటున్నారు. అటు టీడీపీ తరుపున మాజీ ఎమ్మెల్యే సౌమ్య ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలాగే అమరావతి ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఇక అమరావతి దగ్గరగా ఉండటంతో నందిగామ ప్రజలు మూడు రాజధానులకు పెద్దగా మద్ధతు ఇవ్వడం లేదు. ఇదే వైసీపీ ఎమ్మెల్యేకు కాస్త మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. మిగతా విషయాల పరంగా నందిగామ ఎమ్మెల్యే జగన్ దూసుకెళుతున్నారనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: