పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గాల్లో చింతలపూడి కూడా ఒకటి. ఇక్కడ టీడీపీ తరుపున ఎక్కువసార్లు గెలిచింది కోటగిరి విద్యాధర రావు. 1983లో ఇండిపెండెంట్‌గా గెలిచిన కోటగిరి, 1985, 1989, 1994, 1999  ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి గెలిచారు. ఇక 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. 2014 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ విజయం సాధించింది.

2019 ఎన్నికల్లో వి‌ఆర్ ఎలీజా వైసీపీ తరుపున భారీ మెజారిటీతో గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజలకు బాగానే అందుబాటులో ఉంటున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చేస్తున్నారు. అయితే ఎలీజా ఇక్కడ పేరుకే ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే నియోజకవర్గంలో మొత్తం డామినేషన్ కోటగిరి విధ్యాదర రావు తనయుడు, ఏలూరు వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌దే.

ఇది తన సొంత నియోజకవర్గం కావడంతో, ఆయన అనుకున్న విధంగానే పనులు చేయించుకుంటున్నారు. నియోజకవర్గంలో కామవరపుకోట శ్రీధర్ సొంత మండలం. ఇక ఈ మండలంతో పాటు లింగపాలెం, జంగారెడ్డి గూడెం మండలాల్లో శ్రీధర్ వర్గం బలం బాగా ఉంది. దీంతో ఈ మూడు మండలాల్లో ఎంపీ డామినేషన్ నడుస్తోంది. అలాగే చింతలపూడిలో బలంగా ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని సైతం తనవైపు తిప్పేసుకున్నారు. ఎంపీతో పాటు కేవీపీ రామచంద్రరావు బామ్మర్ది మేడవరపు అశోక్ బాబు ఆధిపత్యం కూడా ఎక్కువే. శ్రీధర్, అశోక్ బాబులు ఒకే సామాజికవర్గం(వెలమ) కావడంతో, చింతలపూడిలో వీరు ఎమ్మెల్యేకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకుండా వీరి వర్గాలకే టిక్కెట్లు దక్కేలా చేసుకున్నారు.

ఇక చింతలపూడిలో పదవులు పంపకాల్లో గానీ, కేడర్‌ని నడపటంలో గానీ శ్రీధర్ మాటే చెల్లుబాటు అవుతుంది. అయితే శ్రీధర్, అశోక్ బాబులకు పోటీగా ఎమ్మెల్యే కూడా తన సామాజికవర్గాన్ని(ఎస్సీ) బాగా ప్రోత్సహించుకుంటూ సెపరేట్ గ్రూపుని నడుపుతున్నారు. అయితే ఈ గ్రూప్ రాజకీయాల మధ్యలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యం. అటు చింతలపూడిలో టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఎన్నికల్లో ఓడిపోయిన కర్రా రాజారావు ఎప్పుడో సైడ్ అయిపోయారు. దీంతో మాజీ మంత్రి పీతల సుజాత నియోజకవర్గంలో పట్టు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే చింతలపూడిలో టీడీపీ అంత బలంగా లేదు. వైసీపీలో గ్రూప్ తగాదాలు ఉన్నా సరే వాటిని ఉపయోగించుకుని టీడీపీ బలపడలేకపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: