
ప్రస్తుతం వైసీపీ తరుపున కారుమూరి నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో కారుమూరి కాంగ్రెస్ నుంచి గెలిచి, 2014 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు. ఇక 2014 ఎన్నికల్లో దెందులూరు నుంచి పోటీ చేసి ఓడిపోయి, 2019లో తణుకు నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కారుమూరి తణుకు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు.
సమస్యలు ఉన్న ప్రజలు కారుమూరి ఇంటికే నేరుగా వెళ్తారు. అటు పార్టీ కార్యాలయంలో కూడా ఎమ్మెల్యే ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా చేస్తున్నారు. ఇక కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ సెంటర్ల నిర్మాణాలకు శంఖుస్థాపనలు చేస్తున్నారు. అటు నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలని అద్భుతంగా అభివృద్ధి చేశారు.
అలాగే నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు. అయితే నియోజకవర్గంలో కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అటు తణుకులో ఇళ్ల పట్టాల్లో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం ఇదే విషయం చెప్పారు. తణుకులో జరిగిన అవినీతిపై విచారణ చేయాలని జగన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఇక కొత్తగా సచివాలయాల నిర్మాణాలు తప్పా, తణుకులో కొత్త అభివృద్ధి ఏమి జరగడం లేదు.
అలాగే నియోజకవర్గంలో రహదారుల సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. అత్తిలి మండలంలో మార్కెట్ యార్డు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. ఇక ఈ ప్రాంతంలో చెరకు సాగు విరివిగా జరిగేది. ప్రస్తుతం ఆంధ్రాసుగర్స్‌లో ఉత్పత్తి నిలిచిపోవడంతో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. తణుకు పట్టణానికి వేసవిలో గోదావరి జలాలు అందడం లేదు.
ఇక రాజకీయ పరంగా చూసుకుంటే ఎమ్మెల్యేగా కారుమూరి ఓకే అనిపించుకుంటున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో జరిగే పలు అక్రమాలు ఆయనకు నెగిటివ్ అవుతున్నాయి. ఇటు ఎన్నికల్లో 2 వేల ఓట్లతో ఓడిపోయిన టీడీపీ నేత అరిమిల్లి రాధాకృష్ణ బలం పుంజుకున్నట్లే కనిపిస్తున్నారు. ప్రజా సమస్యలపై బాగానే పోరాడుతున్నారు. కార్యకర్తలని కలుపుకునిపోతూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లైతే ఎమ్మెల్యేగా కారుమూరి పర్వాలేదనిపిస్తుంటే, టీడీపీ నేత అరిమిల్లి రోజురోజుకూ పుంజుకుంటున్నారు.