విశాఖపట్నం జిల్లాలో టీడీపీకి పెద్ద బలం లేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పాడేరు నియోజకవర్గమే. ఆ పార్టీ ఆవిర్భావించక ఇక్కడ టీడీపీ గెలిచింది మూడుసార్లే. 1985, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఇంకా ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. ఇక గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ వైసీపీదే పైచేయి. 2014లో ఇక్కడ వైసీపీ తరుపున గిడ్డి ఈశ్వరి గెలిచారు. అయితే తర్వాత ఆమె టీడీపీలో చేరడంతో, 2019 ఎన్నికల్లో భాగ్యలక్ష్మి వైసీపీ తరుపున బరిలో దిగితే, ఈశ్వరి టీడీపీ తరుపున పోటీ చేశారు.

ఇక జగన్ వేవ్‌లో భాగ్యలక్ష్మి, ఈశ్వరిపై భారీ మెజారిటీతో గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భాగ్యలక్ష్మి తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. పథకాలు ఎలాంటి లోటు లేకుండా అందిస్తున్నారు. ఇక ఇవే ఎమ్మెల్యేకు ఫుల్ అడ్వాంటేజ్ అవుతున్నాయి. ఎమ్మెల్యే పనితీరుకు కూడా మంచి మార్కులే పడుతున్నాయి.

టీడీపీ తరుపున మాత్రం ఈశ్వరి పెద్ద యాక్టివ్‌గా ఉండటం లేదు. అటు టీడీపీ కేడర్ కూడా చెల్లాచెదురైపోయింది. దీంతో ఇక్కడ టీడీపీకి సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నెక్స్ట్ ఎన్నికల్లోపు టీడీపీ పుంజుకోకపోతే ఇక్కడ మళ్ళీ వైసీపీదే గెలుపు. అయితే ఏజెన్సీ ప్రాంతం కావడంతో పాడేరులో సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. బడా సంస్థలు ఇక్కడి విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టి, దోచుకోవడం తప్పితే, పెద్దగా స్థానికులకు ఉపయోగపడేది లేదు.

మారుమూల పల్లె ప్రాంతాలలో దాదాపు 70 శాతం ప్రజలకు సురక్షిత మంచి నీళ్లు అందుబాటులో లేదు. మంచినీటి సమస్య వర్షాకాలంలో కూడా ఇక్కడ తీవ్రంగానే ఉంటుంది. ఆశ్రమ పాఠశాలల మాదిరి గిరిజన ప్రాంతపు పాఠశాలలకు భోజనం, వైద్యం, వసతిసౌకర్యాలు కల్పించి, ఇక్కడి పిల్లలను విద్యావంతులుగా చేయాల్సిన అవసరముంది. అటు పాడేరు, సంగలోయ బస్సును పునరుద్ధరించాలి. సులభం ఘాట్ రోడ్డు మరమ్మతులు చేసి నాలుగు పంచాయితీల ప్రజలకు మోక్షం కల్పించాల్సి ఉంది. కొయ్యూరు మండలంలో జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: