విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం...పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డా. ఇక్కడ నుంచి అశోక్ వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకసారి జనతా పార్టీ నుంచి గెలిచిన అశోక్ ఆరుసార్లు టీడీపీ నుంచి గెలిచారు. అయితే 2004లో కోలగట్ల వీరభద్రస్వామి రాజుగారికి చెక్ పెట్టారు. ఇక 2014 ఎన్నికల్లో రాజుగారు విజయనగరం ఎంపీగా గెలిస్తే, అసెంబ్లీ స్థానంలో మీసాల గీత, వైసీపీ నుంచి పోటీ చేసిన కోలగట్లపై విజయం సాధించారు.

2019 ఎన్నికలోచ్చేసరికి కోలగట్ల, అశోక్గజపతిరాజు  కుమార్తె అతిథిపై సూపర్ విక్టరీ కొట్టారు. ఇటు వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో కోలగట్ల దూకుడుగా పనిచేస్తున్నారు. అశోక్ గజపతి రాజు ఫ్యామిలీని వీక్ చేసి, వైసీపీని బలోపేతం చేశారు. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ పెత్తనం జిల్లాలో ఎక్కడైనా సాగుతుందేమో గానీ, విజయనగరం నియోజకవర్గంలో సాగడం చాలా కష్టం. ఇక్కడ కోలగట్ల ఆధిపత్యమే ఎక్కువ. స్థానిక సమస్యలని పరిష్కరించడంలో కోలగట్ల ముందున్నారు. నియోజకవర్గంలో చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అటు టీడీపీ తరుపున అశోక్ కుమార్తె అతిథి బాగానే కష్టపడుతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అతిథి ఎంత కష్టపడినా ఇక్కడ కోలగట్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. పైగా నెక్స్ట్ మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి ఇస్తే తిరుగుండదు.

ఇక విజయనగరం నియోజకవర్గంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. విజయనగరం పట్టణంలో తాగు నీటి సమస్య ఎక్కువగా ఉంది. తాగునీటి సమస్య తరువాత ఈ పట్టణంలో అతి పెద్ద సమస్య ఇరుకు రహదారులు, పారిశుద్ధ్యం లేమి. తారకరామా తీర్ధసాగర్‌కు మరిన్ని నిధులు కేటాయిస్తే, తాగునీటి అవసరాలు తీర్చవచ్చు. పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్న స్థితిలో ఉండటంతో, మురుగునీరు వీధులలోనే ప్రవహిస్తూ ఉంటుంది. అటు రూరల్‌లో సరైన అభివృద్ది జరగడం లేదు. బస్ కాంప్లెక్స్‌ని అభివృద్ధి చేయాల్సిన అవసరముంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: