
2019 ఎన్నికలోచ్చేసరికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు వెంకట్రావుపై వైసీపీ నుంచి పోటీ చేసిన గోర్లే కిరణ్ కుమార్ సూపర్ విక్టరీ కొట్టారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్...కళా వెంకట్రావుకు చెక్ పెట్టే దిశగా నడుస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్, కొత్త గ్రామ సచివాలయ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పథకాలు ఎలాంటి లోటు లేకుండా అందుతున్నాయి. అటు నాడు-నేడు ద్వారా నియోజకవర్గంలోని పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి.
రాజకీయంగా బాగా బలపడుతున్నారు. ఇప్పటికే కొంత టీడీపీ కేడర్‌ని వైసీపీలోకి లాగేశారు. అలాగే ప్రతిపక్ష టీడీపీకి కౌంటర్లు ఇవ్వడంలో కిరణ్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అటు టీడీపీని కిమిడి కళా వెంకట్రావు నడిపిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పెద్దగా పుంజుకున్నట్లు కనిపించడం లేదు. పైగా నామమాత్రంగానే ఏపీ అధ్యక్షుడుగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే త్వరలోనే అధ్యక్ష పదవి కూడా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడుని నియమిస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఎచ్చెర్లలో పరిష్కారం కాని సమస్యలు బాగానే ఉన్నాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో జి. సింగడం, లావేరు, ఎచ్చెర్ల ఇంకా రణస్థలం మండలాలు ఉన్నాయి. సాగునీరు, తాగునీరు, విద్య, ఉఫాధి ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు. అలాగే మహిళా డిగ్రీ కళాశాల కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. సాగు నీటి విషయానికి వస్తే, నారాయణపురం ఎడమ కాలువ తోటపల్లె కాలువల ద్వారా సాగు నీటిని అందుబాటులోకి తెచ్చి, బుడమేరు చెరువును రిజర్వాయరుగా మార్పు చేస్తే, 58 వేల ఎకరాల సాగుభూమికి నీరందించవచ్చని అంచనా. ధర్మవరం నుంచి లావేటిపేట వయా రామజోగిపేట మీదుగా, ఓఏ అగ్రహారం నుంచి ధర్మవరం బీటీ రోడ్డు, చినకొంగరాం నుంచి కొంగరాం వరకు రోడ్లను అభివృద్ధి చేయాల్సి ఉంది.