ఇక 2014 ఎన్నికలకొచ్చేసరికి ఎన్టీఆర్ మరో తనయుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం బరిలో దిగి విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ కూడా అధికారంలోకి రావడంతో హిందూపురంలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలకు బాలయ్య చెక్ పెట్టారు. నియోజకవర్గానికి పెద్దగా అందుబాటులో లేకపోయిన పీఏ ద్వారా పనులన్నీ చక్కబెట్టేవారు. ముఖ్యంగా హిందూపురం ప్రజలు ఎక్కువ ఇబ్బందిపడే త్రాగునీటి సమస్యని పరిష్కరించారు. అదేవిధంగా నియోజకవర్గంలో పలురకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
ఆ ఐదేళ్లు లేపాక్షి ఉత్సవాలు ఘనంగా చేశారు. ఇక బాలయ్య పనులు బాగానే చేసినా...తన నోటిదురుసు కాస్త ఇబ్బంది అయింది. హిందూపురంలో సొంత అభిమానులునే తిట్టి, కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి బాలయ్య వైసీపీ అభ్యర్ధి మహమ్మద్ ఇక్బాల్‌పై 17 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక రెండోసారి గెలిచిన బాలయ్య...ప్రజలకు అందుబాటులో లేకపోయినా సరే పనులు చేయిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో హిందూపురం హాస్పిటల్‌కు తన సొంత ఖర్చుతో వెంటిలేటర్స్, పిపిఈ కిట్లు ఇచ్చారు.
అయితే బాలయ్య ఎన్ని పనులు చేసినా ఎక్కువ శాతం నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం కాస్త ఇబ్బందే అవుతుంది. పైగా వైసీపీ అధికారంలో ఉండటం ఇక్బాల్‌కు కలిసొస్తుంది. ఆయన దగ్గర ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. కానీ వైసీపీలో ఉన్న గ్రూపు తగాదాలు వల్ల బాలయ్యకు అడ్వాంటేజ్ అవుతుంది. ఒకవేళ బాలయ్య నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఎప్పటికప్పుడు ఫీల్డ్‌లో ఉంటూ ప్రజల సమస్యలని పరిష్కరించడానికి ప్రయత్నిస్తే ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుంది. ఏదేమైనా హిందూపురంలో టీడీపీ గెలుపు ఆపడం మాత్రం కష్టమే అనిపిస్తుంది.