
పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేల్లో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు ముందు వరుసలో ఉంటారు. 2009లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి నరసాపురం నుంచి గెలిచిన ప్రసాద రాజు, 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక మొదటి విడతలో పదవి మిస్ అయినా, రెండో విడతలో ప్రసాదరాజుకు పదవి రావడం ఖాయమని జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ విషయంపై ఎప్పటినుంచో చర్చ నడుస్తోంది.
ఇక మంత్రి పదవి దక్కించుకునేందుకు ప్రసాదరాజు ఎమ్మెల్యేగా గట్టిగా కష్టపడుతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు. అటు పథకాలు బాగానే అందిస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టారు. అలాగే నియోజకవర్గంలో బాగానే అభివృద్ధి జరుగుతుంది. ఆక్వా రైతులకు అండగా ఉంటున్నారు. పశ్చిమగోదావరిలో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ప్లస్ కానుంది. అటు టీడీపీ, జనసేన కార్యకర్తలని తనవైపుకు తిప్పుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. అయితే సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉన్న నరసాపురంలో తాగునీటి సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. మత్స్యకారులని ఆదుకోవాల్సిన అవసరముంది.
రాజకీయ పరంగా చూసుకుంటే ఇక్కడ ప్రసాదరాజు స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అటు టీడీపీ నేత బండారు మాధవనాయుడు యాక్టివ్ గానే ఉన్నారు. తనకు సాధ్యమైన మేర పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇక ఇక్కడ టీడీపీ కంటే జనసేన బలంగా ఉంది. ఆ విషయం 2019 ఎన్నికల్లోనే అర్ధమైంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన-టీడీపీలు కలిసిపోటీ చేస్తే ప్రసాదరాజుకు చెక్ పడటం ఖాయం. లేదంటే మళ్ళీ ప్రసాదరాజు గెలుపు ఆపడం కష్టం. పైగా మంత్రి పదవి వస్తే రాజుగారికి తిరుగుండదు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసి రాజుగారికి చెక్ పెడతాయో లేదా విడిగా పోటీ చేసి చిత్తు అవుతాయో. ఏదేమైనా నరసాపురంలో ప్రసాదరాజు బలం మాత్రం తగ్గడం లేదు.