2014 ఎన్నికల్లో టీడీపీకి జనసేన సపోర్ట్ ఇవ్వడం వల్ల మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి లబ్ది జరిగిన కూడా విషయం కూడా తెలిసిందే. టీడీపీ-జనసేనలు సెపరేట్‌గా పోటీ చేయడం వల్ల వైసీపీకి బాగా కలిసొచ్చింది. ఓట్లు చీలిపోయి చాలామంది వైసీపీ నుంచి గెలిచేశారు.


అలా టీడీపీ- జనసేన విడివిడిగా బరిలో ఉండటంతో గెలిచిన ఎమ్మెల్యేల్లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కూడా ఒకరు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కారుమూరి 75,975 ఓట్లు తెచ్చుకున్నారు. టీడీపీ నుంచి పోటీ చేసిన అరిమిల్లి రాధాకృష్ణ 73,780 ఓట్లు తెచ్చుకున్నారు. అటు జనసేన నుంచి బరిలో దిగిన పసుపులేటి వెంకట రామారావు 31,961 ఓట్లు తెచ్చుకున్నారు. అంటే కారుమూరికి వచ్చిన మెజారిటీ 2,195 ఓట్లు. ఒకవేళ టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసి ఉంటే పరిస్తితి ఎలా ఉండేదో చెప్పాల్సిన అవసరం లేదు.


అయితే కారుమూరి 2009లో కాంగ్రెస్ నుంచి ఒకసారి గెలిచారు. మళ్ళీ 2019లో గెలిచారు. ఇలా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కారుమూరి, తణుకు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు. సమస్యలు ఉన్న ప్రజలు కారుమూరి ఇంటికే నేరుగా వెళ్తారు. అటు పార్టీ కార్యాలయంలో కూడా ఎమ్మెల్యే ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా చేస్తున్నారు.

అలాగే నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు. అటు తణుకులో ఇళ్ల పట్టాల్లో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం ఇదే ఆరోపణ చేసిన విషయం తెలిసిందే. ఇసుకలో అక్రమాలు కూడా జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.


అలాగే నియోజకవర్గంలో రహదారుల సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. అత్తిలి మండలంలో మార్కెట్ యార్డు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. ఇక ఈ ప్రాంతంలో చెరకు సాగు విరివిగా జరిగేది. ప్రస్తుతం ఆంధ్రాసుగర్స్‌లో ఉత్పత్తి నిలిచిపోవడంతో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. తణుకు పట్టణానికి వేసవిలో గోదావరి జలాలు అందడం లేదు.


ఇక రాజకీయ పరంగా చూసుకుంటే ఎమ్మెల్యేగా కారుమూరి ఓకే అనిపించుకుంటున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో జరిగే పలు అక్రమాలు ఆయనకు నెగిటివ్ అవుతున్నాయి. ఇటు ఎన్నికల్లో 2 వేల ఓట్లతో ఓడిపోయిన టీడీపీ నేత అరిమిల్లి రాధాకృష్ణ బలం పుంజుకున్నట్లే కనిపిస్తున్నారు. ప్రజా సమస్యలపై బాగానే పోరాడుతున్నారు. కార్యకర్తలని కలుపుకునిపోతూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లైతే కారుమూరికి అరిమిల్లి గట్టిగానే పోటీ ఇస్తున్నారు. ఇదే సమయంలో జనసేన-టీడీపీ కలిస్తే కారుమూరికి ఇబ్బందే.

మరింత సమాచారం తెలుసుకోండి: