కర్నూలు జిల్లాలో వైసీపీ స్ట్రాంగ్‌గా ఉన్న నియోజకవర్గాల్లో బనగానపల్లె ఒకటి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బలంగా ఉన్నారు. అయితే కాటసాని మొదట ప్రజారాజ్యం నుంచి 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి టీడీపీ నేత బీసీ జనార్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోయినా సరే పార్టీ తరుపున గట్టిగా నిలబడ్డారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వంపై పోరాడారు. ఫలితంగానే 2019 ఎన్నికల్లో బీసీపై కాటసాని విజయం సాధించారు.


రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని నియోజకవర్గంలో ప్రజల సమస్యలని పరిష్కరించడంలో ముందే ఉన్నారు. అదేవిధంగా టీడీపీతో సహ ఇతర పార్టీ కార్యకర్తలని తమ పార్టీలో చేర్చుకుంటూ ముందుకెళుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యలోనే తిరుగుతున్నారు. అటు ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి ద్వారా సాయం చేస్తున్నారు. అలాగే కరోనా సమయంలో పేదలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆసుపత్రులని తనిఖీ చేస్తూ, ప్రజలకు సరైన వైద్యం అందేలా చేస్తున్నారు.


అటు నియోజకవర్గంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, సి‌సి రోడ్లు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. ఇక రాజకీయంగా చూసుకుంటే కాటసాని బలంగానే ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటారు. అయితే టీడీపీ తరుపున పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈయనకు నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఎన్నికల్లో తక్కువ మెజారిటీతోనే ఓడిపోయారు.

 

ఇక తాజాగా కాటసాని అనుచరులపై దాడి కేసులో పోలీసులు ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టి బీసీని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేయడం వల్ల బీసీపై మరింత సానుభూతి పెరిగే అవకాశముంది. జైలు నుంచి వచ్చాక మరింత ఎఫెక్టివ్‌గా పనిచేసే ఛాన్స్ ఉంది. కాబట్టి భవిష్యత్‌లో బీసీతో కాటసానికి ఇబ్బందే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: