
వైసీపీలో చాలామంది యువ ఎమ్మెల్యేలు దూకుడుగా ఉంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నారు. అలా తక్కువ సమయంలోనే హైలైట్ అయిన ఎమ్మెల్యేల్లో పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ ఒకరు. పలమనేరు నుంచి తొలిసారి పోటీ చేసిన వెంకట్..టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. దాదాపు 32 వేల ఓట్ల పైనే మెజారిటీతో వెంకట్ గెలిచి సత్తా చాటారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గౌడ, నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు. యువకుడు కావడంతో నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి లోటు రానివ్వడం లేదు. ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేస్తున్నారు. కరోనా వేళ ప్రజలకు అండగా ఉంటున్నారు. నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్లని ఏర్పాటు చేసి ప్రజలకు సరైన వైద్యం అందేలా కృషి చేస్తున్నారు. ఇక నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. రోడ్లని అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. తాగునీటి సమస్యలు ఉన్నాయి.
రాజకీయంగా చూసుకుంటే వెంకట్ గౌడ నియోజకవర్గంలో స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. అటు టీడీపీని అమర్నాథ్ రెడ్డి నడిపిస్తున్నారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్, తర్వాత టీడీపీలోకి వచ్చి మంత్రి అయ్యారు. మంత్రిగా నియోజకవర్గంలో మంచిగానే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
కానీ 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ప్రతిపక్షంలోనే ఉంటూ, ప్రజల తరుపున పోరాడుతున్నారు. అయితే వెంకట్ బాగా దూకుడుగా ఉండటంతో అమర్నాథ్ పలమనేరులో పుంజుకున్నట్లు కనిపించడం లేదు. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సీనియర్ నేతగా ఉన్న అమర్నాథ్‌కు జూనియర్ ఎమ్మెల్యే అయిన గౌడ మళ్ళీ చెక్ పెట్టేసేలా ఉన్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో పరిస్తితి ఎలా ఉంటుందో?