గుంటూరు జిల్లాలో కమ్మ సామాజికవర్గం ప్రభావం ఉన్న నియోజకవర్గాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులే పలు నియోజకవర్గాల్లో డామినేషన్ చేస్తుంటారు. అలా కమ్మ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో వినుకొండ కూడా ఒకటి. గత కొన్నేళ్లుగా ఈ నియోజకవర్గంలో కమ్మ నేతల ప్రభావం ఎక్కువ ఉంది.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి 2009, 2014 ఎన్నికల్లో కమ్మ వర్గానికి చెందిన జివి ఆంజనేయులు వినుకొండలో గెలిచారు. ఇక ఈ కమ్మ నేతకు చెక్ పెట్టడానికి జగన్, అదే వర్గానికి చెందిన బొల్లా బ్రహ్మనాయుడుని 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున నిలబెట్టారు. ఇక జగన్ వ్యూహం సక్సెస్ అయింది. ఎన్నికల్లో బొల్లా, జివిపై విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బొల్లా దూకుడుగానే ఉన్నారు.
నియోజకవర్గంలో తనదైన శైలిలో పనిచేస్తూ ప్రజల సమస్యలని పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు ప్లస్ అవుతున్నాయి. అటు నియోజకవర్గంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, సిసి రోడ్ల నిర్మాణాలు జరిగాయి. ఇక ఆపదలో ఉన్నవారికి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందిస్తున్నారు. అయితే బొల్లాపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇసుకలో అక్రమాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. అటు ఇళ్ల పట్టాల్లో కూడా లెక్కలేని అక్రమాలకు పాల్పడ్డారని అంటున్నారు. వినుకొండలో వందల కోట్లు వైసీపీ నేతలు దోచేశారని టీడీపీ ఇన్చార్జ్ జీవీ ఆంజనేయులు ఆరోపణలు చేస్తున్నారు.
అదేవిధంగా ఈ మధ్య జీవీకి చెందిన సేవాసంస్థ శివశక్తి కరోనా రోగులకు ఉచితంగా ఆహారం అందించే కార్యక్రమాన్ని బొల్లా అడ్డుకుని వార్తల్లోకి ఎక్కారు. కరోనా రోగులకు సేవ చేసే వారిని అడ్డుకోవడం కరెక్ట్ కాదనే విమర్శలు వచ్చాయి. అటు జీవీ ఆంజనేయులు సైతం టీడీపీ తరుపున గట్టిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ బొల్లాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అందుకే బొల్లాపై తీవ్ర విమర్శలు చేస్తూ దెబ్బకొట్టడానికి చూస్తున్నారు. మరి చూడాలి జీవీ విమర్శలు ఏ మేరకు సక్సెస్ అయ్యి బొల్లాపై నెగిటివ్ పెరుగుతుందో?