
జగన్ మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేయాలని చాలామంది ఎమ్మెల్యేలు చూస్తున్న విషయం తెలిసిందే. మొదటి విడతలో ఛాన్స్ దక్కనివారు, రెండో విడతలో మంత్రి హోదా దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు సైతం జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నారు.
అయితే మొదటి విడతలోనే ఈయనకు పదవి మిస్ అయింది. అప్పుడే మంత్రి పదవి ఫిక్స్ అయిపోయిందని కోరుముట్లని రాజధానికి రమ్మని కూడా కబురు పంపేశారు. కానీ అనూహ్యంగా సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా చివరి నిమిషంలో కోరుముట్లకు మంత్రి పదవి మిస్ అయింది. ఇక ఈసారి మాత్రం కోరుముట్లకు పదవి గ్యారెంటీ అని ప్రచారం జరుగుతుంది.
ఇక మంత్రి పదవి విషయం పక్కనబెడితే ఎమ్మెల్యేగా కోరుముట్ల రైల్వేకోడూరులో దూసుకెళుతున్నారు. 2009లో కాంగ్రెస్ తరుపున గెలిచిన కోరుముట్ల తర్వాత వైఎస్సార్ మరణంతో కాంగ్రెస్‌ని వదిలేసి వైసీపీలోకి వచ్చేశారు. 2012 ఉపఎన్నికలో వైసీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ తరుపున విజయం సాధించారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన కోరుముట్ల రైల్వే కోడూరు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు.
నియోజకవర్గంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, సిసి రోడ్ల నిర్మాణాలు జరిగాయి. అటు ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదలకు ఇళ్ళు కట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇక ప్రభుత్వ పథకాలు ఎలాంటి లోటు లేకుండా అమలు చేస్తున్నారు. టీడీపీకి చెందినవారికి కూడా పథకాలు అందిస్తున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ వన్‌సైడ్ విజయాలని సాధించింది.
ఇక్కడ టీడీపీ తరుపున నరసింహాప్రసాద్ పనిచేస్తున్నారు. అయితే రైల్వే కోడూరులో వైసీపీ చాలా బలంగా ఉంది. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో కోరుముట్లని ఓడించడం చాలా కష్టం. అందుకే నరసింహ నెక్స్ట్ ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్‌కు వెళ్లిపోవాలని చూస్తున్నారు. దీని బట్టి చూస్తే కోడూరులో కోరుముట్ల ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో చెప్పొచ్చు. పైగా మంత్రి పదవి కూడా వస్తుంది. దీంతో మరింతగా కోడూరులో కోరుముట్ల బలపడతారు.