
ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయి, వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది. ఈ రెండేళ్ల కాలంలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఇమేజ్ వల్ల ఎమ్మెల్యేలు బలంగా కనిపిస్తున్నారు. అదే సమయంలో కొన్నిచోట్ల టీడీపీ నేతలు సైతం, వైసీపీ ఎమ్మెల్యేలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో గానీ జనసేన-టీడీపీ పొత్తు పెట్టుకుంటే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల గెలుపుకు ఇబ్బంది అవుతుంది.
ఒకవేళ జనసేన-టీడీపీ పొత్తు పెట్టుకుంటే నష్టపోయే వైసీపీ ఎమ్మెల్యేల్లో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా ఉంటారు. 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఓడిపోయిన జగ్గిరెడ్డి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి 700 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో సైతం జగ్గిరెడ్డి నాలుగు వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇలా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గిరెడ్డి నియోజకవర్గంలో బాగానే ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే, ప్రభుత్వ పథకాలని అందిస్తున్నారు. కొత్తపేటలో సచివాలయాలు, హెల్త్ కేర్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగాయి. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ఇళ్ళు లేని పేదలకు జగనన్న కాలనీల ద్వారా లబ్ది జరగనుంది. నియోజకవర్గంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మారుమూల గ్రామాల్లో రోడ్ల సదుపాయం సరిగ్గా లేదు. రైతులకు సరైన గిట్టుబాటు ధర అందించడంలో ప్రభుత్వం విఫలమైంది.
రాజకీయంగా చూసుకుంటే జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా పర్వాలేదనిపిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నేత బండారు సత్యానందరావు ఇక్కడ బలంగానే ఉన్నారు. గత ఎన్నికల్లోనే 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం వైసీపీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే జనసేన గానీ సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ ఇక్కడ టీడీపీ గెలుపు సులువు. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు 35 వేల ఓట్ల వరకు పడ్డాయి. కానీ టీడీపీ ఓడిపోయింది 4 వేల ఓట్ల తేడాతోనే కాబట్టి నెక్స్ట్ టీడీపీ-జనసేన కలిస్తే ఇక్కడ వైసీపీకి చెక్ పడుతుంది.