గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ని ఓడించిన గ్రంథి శ్రీనివాస్‌పై భీమవరం ప్రజలు బాగానే ఆశలు పెట్టుకున్నారనే చెప్పొచ్చు. సంచలన విజయం సాధించిన గ్రంథిపై అక్కడ ప్రజలకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. అలా పవన్‌పై సూపర్ విక్టరీ కొట్టిన గ్రంథి శ్రీనివాస్ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్నారా? అంటే కొంచెం అవునని, కొంచెం కాదని భీమవరం ప్రజల నుంచి సమాధానం వస్తుందని చెప్పొచ్చు.


ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ ప్రజలకు అందుబాటులో ఉండటం కాస్త తక్కువే అంటున్నారు. కానీ సమస్య ఉందని తన దగ్గరకొచ్చే ప్రజలకు అండగా నిలబడటంలో గ్రంథి ముందున్నారు. అటు నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు బాగానే అమలు అవుతున్నాయి. కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణాలు జరిగాయి. ఇక ఇళ్ల స్థలాలు ఇచ్చి, అందులో పేదలకు జగనన్న కాలనీల పేరిట ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది.


అయితే ఇళ్ల స్థలాల విషయంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు వచ్చాయి. అటు ఇసుక దోపిడి కూడా ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యే సైతం అన్నీ వర్గాల ప్రజలని కలుపుకుని  పోవడంలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. ఇక ఫంక్షన్లకు వెళ్లడంలో, ఏదైనా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌లు చేయడంలో గ్రంథి ముందున్నారని అంటున్నారు. అటు నియోజకవర్గంలో ఉన్న ఆక్వా రైతులని ఆదుకోవాల్సిన అవసరముంది. ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎఫెక్ట్‌తో నియోజకవర్గంలో క్షత్రియులు కాస్త వైసీపీకి యాంటీగా ఉన్నారు.


కాకపోతే ఇక్కడ జనసేనని నడిపించే నాయకుడు లేకపోవడం, టీడీపీలో ఉన్న నాయకుడు యాక్టివ్‌గా లేకపోవడం గ్రంథికి బాగా ప్లస్ అవుతున్నాయి. ఓడిపోయాక పవన్ మళ్ళీ భీమవరం వైపు చూడలేదు. దీంతో ఇక్కడ జనసేన కేడర్ చెల్లాచెదురైంది. అటు టీడీపీ నేత పులపర్తి అంజిబాబు యాక్టివ్‌గా లేరు. టీడీపీ కేడర్ సైతం తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇలా రెండు పార్టీలు సరిగ్గా లేకపోవడం వల్ల ఎమ్మెల్యే గ్రంథికి బాగా అడ్వాంటేజ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: