
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు టీడీపీ ప్లస్ అవుతుందా? అంటే అవుననే చెప్పొచ్చు. 2014లో ఇక్కడ వైసీపీ తరుపున సునీల్ కుమార్ పోటీ చేసి గెలిచారు. కానీ 2019లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా జగన్ బాబుకు సీటు ఇచ్చారు. ఇక జగన్ వేవ్‌లో బాబు దాదాపు 29 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్ధి లలితకుమారిపై గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాబు ప్రమాణస్వీకారం రోజే తడబడి, సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు.
అలా ట్రోల్ అయిన బాబు నియోజకవర్గంలో పనిచేయడంలో మాత్రం ముందున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అలాగే అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, స్థానికంగా ఉండే సమస్యలని పరిష్కరిస్తున్నారు. అటు ప్రభుత్వ పథకాలు బాబుకు బాగా ప్లస్ అవుతున్నాయి. జగనన్న కాలనీలు పేరిట పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది.
పూతలపట్టులో కొత్తగా రైతుభరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల నిర్మాణం జరిగింది. నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి. సాగునీరు, తాగునీరు సమస్యలు ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి. అలాగే మామిడి రైతుల ఈ ఏడాది ఎక్కువగానే నష్టపోయారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్తితి బాగోలేదు. అటు రాజకీయంగా చూసుకుంటే పూతలపట్టులో ఎమ్మెల్యే గొప్ప పనితీరు కనబర్చకపోయినా జగన్ ఇమేజ్, పథకాలు, టీడీపీ వీక్ అవ్వడం అంశాలు కలిసొస్తున్నాయి.
ఇక్కడ టీడీపీ తరుపున సరైన నాయకులు లేరు. గత మూడు ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన లలితకుమారి, ఆ పార్టీకి రాజీనామా చేసేశారు. స్థానిక ఎన్నికల సమయంలో తన వర్గాన్ని పట్టించుకోలేదనే అసంతృప్తితో లలిత టీడీపీని వీడారు. ఆమె టీడీపీని వీడాక మరో నాయకుడుని చంద్రబాబు ఇన్‌చార్జ్‌గా పెట్టలేదు. దీంతో పూతలపట్టులో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. కేడర్ సైతం వైసీపీలోకి వెళ్లిపోతుంది. ఇదే ఎమ్మెల్యే బాబుకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది.