ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో కందుకూరు ఒకటి. ఈ నియోజవర్గంలో గత రెండు పర్యాయాలు వైసీపీ గెలుస్తూ వస్తుంది. అయితే అంతకముందు ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండేది. 9 సార్లు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున మహీధర్ రెడ్డి గెలిచారు.

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఇక ఆ ఎన్నికల్లో వైసీపీ తరుపున పోతుల రామారావు గెలిచారు. ఆ తర్వాత ఆయన టీడీపీలోకి వచ్చేశారు. ఇక కాంగ్రెస్‌ని వీడి మహీధర్ వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో మహీధర్ వైసీపీ నుంచి పోటీ చేసి, టీడీపీ తరుపున పోటీ చేసిన పోతుల రామారావుపై గెలిచారు. ఇక వైసీపీ అధికారంలోకి రావడంతో మహీధర్ సైలెంట్‌గా పనిచేసుకుంటూ వెళుతున్నారు.

ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు తక్కువగా ఎదురుకున్నవారిలో మహీధర్ ముందు వరుసలో ఉంటారు. ఈయన పెద్దగా వివాదాల్లో కూడా లేరు. ఇక కందుకూరులో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, జగనన్న కాలనీల నిర్మాణాల జరుగుతున్నాయి. ప్రభుత్వ పథకాలు మహీధర్‌కు ప్లస్ అవుతున్నాయి.

ఎన్నో ఏళ్లుగా ఉన్న నీటిసమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సాయంతో వెలికొండ ప్రాజెక్టు నుంచి రాళ్ళపాడుకు కృష్ణా జలాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోనే ఉన్న రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం సిద్ధం కావడం మహీధర్‌కు కలిసిరానుంది. రాజకీయంగా మహీధర్ బలంగానే ఉన్నారు. పోతుల పెద్దగా పుంజుకోలేదు. స్థానిక ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీనే సత్తా చాటింది. ముందు నుంచి ఇక్కడ టీడీపీకి పెద్ద ఛాన్స్ లేదు. పైగా పార్టీ బలంగా లేకపోవడం వల్ల వచ్చే ఎన్నికల్లో కూడా మహీధర్‌కు గెలిచే ఛాన్స్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: