ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితులు అందర్నీ చుట్టుముట్టడంతో సంపన్నుల దగ్గర నుండి సామాన్యుల వరకు ఆర్ధిక పరంగా ఊహించని కష్టాలను ఎదుర్కుంటున్న విషయాలు తెలిసిందే. ఈ కష్టాలు కేవలం ఒక నెలకో మరో మూడు నెలలకో పరిమితం కాకుండా మరికొంత కాలం ఈ కష్టాలు సమాజంలోని ప్రతి వ్యక్తిని వెంటాడే పరిస్థితి కనిపిస్తోంది.


ఇలాంటి పరిస్థితులలో ఈ వ్యతిరేక పరిస్థితులను అధిగమించేందుకు పది సూత్రాలను ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతివ్యక్తికి తమతమ స్థాయిలలో ఆదాయాలు తగ్గాయి కాబట్టి ఈ సూత్రాలను అనుసరిస్తే కొంతవరకు ఈ కష్టాల నుండి బయటపడే ఆస్కారం ఉందని మనీ విశ్లేషకుల అభిప్రాయం.


ఈ 10 సూత్రాల సలహాలలో ముఖ్యమైనవి సరదా షాపింగ్ లకు దూరంగా ఉండాలి. అదేవిధంగా అనవసరపు కొనుగోళ్ళ జోలికి వెళ్ళకూడదు. మరీ ముఖ్యంగా విహార యాత్రలకు వెళ్ళలేకపోతున్నామని బాధను మరిచిపోయి మన సమీపంలోని చూడదగ్గ ప్రదేశాలకు వెళ్ళిగడపడం ఉత్తమం. అదేవిధంగా ఇంటి వాతావరణానికి దూరంగా గడిపేందుకు ఎక్కువమంది ప్రస్తుతం రెస్టారెంట్లకు వెళుతున్నారు. అలా వెళ్ళకుండా ఇంటిలోనే ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరుచుకుని రెస్టారెంట్లో మనకు దొరికే ఆహారపదార్థాలను స్వయంగా తయారుచేసుకుంటే కొంతవరకు డబ్బు మిగులుతుంది. మరీ ముఖ్యంగా ఒక కొత్త వస్తువు కొనాలి అన్న ఆలోచన వచ్చిన తరువాత ఆ వస్తువు మనకు అవసరమా లేక అత్యవసరమా అన్న విషయాలు కనీసం రెండు రోజులు ఆలోచించి ఆతరువాత మాత్రమే కొనుగోలు చేస్తే కొంతవరకు అనవసరపు ఖర్చుల నుండి బయటపడవచ్చు.


అంతేకాదు మన కుటుంబ బడ్జెట్ ను 5 విభాగాలుగా విభజించి ఇంటి నిర్వహణ రవాణా ఖర్చులు రోజువారి వ్యయాలు పొడుపు చిన్న ఋణాల చెల్లింపు ఇలా ఐదు విభాగాలుగా విభజించుకుంటే కొంత వరకు మనం ఎక్కడ దుబార చేస్తున్నాం అన్న విషయం బయటపడుతుంది. ప్రస్తుతం నెలకొన్న ఈ కరోనా పరిస్థితుల ప్రభావం నుండి బయటపడటానికి మూడు సంవత్సరాల సమయం పడుతుందని అంచనాలు వస్తున్నాయి. ఈ సూత్రాలను మనం పాటిస్తే కొంతవరకు ఈ కష్టాల నుండి బయటపడవచ్చని మనీ విశ్లేషకుల అభిప్రాయం..


మరింత సమాచారం తెలుసుకోండి: